ప్రయోగాలతో విప్లవాత్మక ఫలితాలు
చేబ్రోలు: కొత్త ప్రయోగాలతో విప్లవాత్మక ఫలితాలు వస్తాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ పద్మశ్రీ వీకే సింగ్ అన్నారు. కర్బన ఉత్ప్రేరిత చర్యల ద్వారా విప్లవాత్మక ఫలితాలను సాధించవచ్చునని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘జాయింట్ ఇండో– ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ ఎక్స్‌ప్లోరింగ్ కాంటెంపరరీ విస్తాస్ ఇన్ అప్లైయింగ్(ఆర్గానో) కాటలిసిస్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీ: ఫర్ సస్టేయినింగ్ ఫ్యూచర్’ అనే అంశంపై మూడు రోజుల సెమినార్‌ను బుధవారం ప్రారంభించారు. తొలుత బ్రోచర్ ఆవిష్కరించారు. ప్రొఫెసర్ వీకే సింగ్ మాట్లాడుతూ.. క్రియేటివిటీ ద్వారా పర్యావరణ అనుకూల కాటలిస్ట్‌లను అభివృద్ధి చేయడం సులభమన్నారు. ఇది గ్రీన్ కెమిస్ట్రీ దిశగా ముందడుగు వేసినట్లని పేర్కొన్నారు. సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ డైరెక్టర్ ప్రొఫెసర్ నితిన్ సేథ్ మాట్లాడుతూ సీఫిప్రా ద్వారా భారత్ – ఫ్రాన్స్ మధ్య శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక పద్ధతుల్లో మౌలిక సహకారం అందుతోందన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు, వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్‌లు డీబీ రామాచారి, పిజ వెంకటేశు, మధుసూదన్, విజ్ఞాన్ వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మేడికొండూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో బుధవారం జరిగింది. మేడికొండూరు సీఐ నాగుల్ మీరా సాహెబ్ తెలిపిన వివరాల ప్రకారం... నాదెండ్ల మండలం సంకురాత్రి పాడు గ్రామానికి చెందిన నన్నం విజయ్ కుమార్ (35) భార్య గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించేందుకు ద్విచక్ర వాహనంపై సంకురాత్రి పాడు నుంచి గుంటూరు వెళుతున్నారు. మార్గమధ్యలో పేరేచర్ల పరిధిలోని రవీంద్ర హోటల్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ సంఘటనలో విజయ్ కుమార్ తలకు తీవ్ర గాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి
గుంటూరు రూరల్: రియల్ ఎస్టేట్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కారులో తీసుకెళ్లి అనంతరం దాడి చేసిన ఘటనపై నల్లపాడు పోలీసు స్టేషన్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం... చల్లావారిపాలెం గ్రామానికి చెందిన ఇమాబత్తిన నాగేశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అతనిని సమీప గ్రామమైన నల్లపాడుకు చెందిన నాగిరెడ్డి, అతని అనుచరులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి గ్రామ శివారులో డబ్బులు డిమాండ్ చేశారు. లేవని చెప్పడంతో దాడి చేశారు. తప్పించుకున్న నాగేశ్వరరావు జీజీహెచ్‌లో చికిత్స పొందారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment