266 పరుగులకు రాజస్థాన్ ఆలౌట్
మంగళగిరి: నగర పరిధిలోని అమరావతి క్రికెట్ టౌన్‌షిప్‌లో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన విజయ్ మర్చంట్ ట్రోఫీ (అండర్ 16 మెన్) క్రికెట్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 266 పరుగులకు ఆలౌటైంది. బుధవారం రాజస్థాన్ , ఉత్తరాఖండ్ జట్ల మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు 82.01 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లు యశ్వంత్ భరద్వాజ్ 8 ఫోర్లతో 50 పరుగులు సాధించాడు. ఎస్.ఖాన్ 48 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్ బౌలర్లు అభిమన్యు, ఎండీ షాహిద్ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఉత్తరాఖండ్ జట్టు 5 ఓవర్లలో 8 పరుగులు సాధించింది.
ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు
ప్రత్తిపాడు: పాఠశాల తరగతి గదిలో నిద్రించిన ఉపాధ్యాయుడికి జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం హెచ్‌ఈ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కె.వి. నారాయణ మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో ఉన్న విద్యార్థులను పక్కనున్న అంగన్‌వాడీ కేంద్రంలోనికి పంపి, పాఠశాల తరగతి గదిలో నిద్రిస్తున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ‘గుర్రువు గారూ ఇది తగునా..!’ శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలో ఎంఈవోలు సీహెచ్. రమాదేవి, జి. లీలారాణిలు విచారణ జరిపి డీఈవోకు నివేదిక అందించారు. హెచ్‌ఎం కొంత అస్వస్థతకు గురై, ఆరోగ్యం సహకరించక విద్యార్థులను అంగన్‌వాడీ కేంద్రంలో ఉంచి విశ్రాంతి తీసుకున్నారని, ఈ మేరకు అంగన్‌వాడీ సహాయకురాలు లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఎంఈవోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసుతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ కూడా జారీ చేసినట్లు డీఈవో సి.వి. రేణుక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment