రాజధానిలో భారీ వడ్డన
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో భూముల ఽరిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. జనవరి ఒకటి నుంచి ఈ మేరకు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఆదాయం పెంపు కోసం ఎక్కడెక్కడ ఎంతెంత పెంచాలనే దానిపై చర్చిస్తున్నారు. జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషను కార్యాలయాల పరిధిలో రిజస్ట్రేషన్ విలువ, బయట మార్కెట్ విలువ తదితర వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని పేరుతో తాడికొండ, పెదకాకాని, అమరావతి, నంబూరు ప్రాంతాల్లో 200–300 శాతం వరకు విలువలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 2024–25లో జిల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యం సుమారు రూ.1,100 కోట్లుగా నిర్ణయించారు. దీనికి మించి ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
పెంపుదల ఇలా ఉండొచ్చు..
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని భావిస్తున్నారు. అంటే రూ. లక్ష ఉన్న విలువ జనవరి నుంచి రూ.1.15 లక్షలు అవుతుంది. పొలాలు ఇప్పటికే ఎకరా రూ.20 లక్షలుంటే.. దానిని రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలు చేయాలని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఏమాత్రం జరగకపోయినా మసిబూసి మారేడుకాయ చేస్తూ రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిపోవడంతో అక్కడ విలువలు పెంచేందుకు పాలకులు సన్నద్ధం అవుతున్నారు. తాడికొండ ప్రాంతంలో ఎకరం రూ.కోటిన్నర నుంచి రూ.ఏడు కోట్ల వరకు పలుకుతుండగా, రిజిస్ట్రేషన్ విలువ మాత్రం ఎకరానికి రూ. 20 లక్షలుగానే ఉంది. దీంతో అక్కడ దీన్ని రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పెంచేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. అపార్ట్‌మెంట్ ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 3 వేలు నుంచి రూ.4 వేలు వరకు పెంచనున్నారు. జాతీయ రహదారుల సమీపంలోని స్థలాలు, భూములకు కూడా భారీగానే పెంపుదల ఉండనుంది. జాయింట్ కలెక్టర్ ఆధ్వరంలోని కమిటీ ఈ విలువలను నిర్ధారించనుంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో..
2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ విలువలు నామమాత్రంగానే పెంచారు. కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ప్రోత్సహించేందుకు ఉన్న విలువలు కూడా తగ్గించారు. 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మూడు సార్లు రిజిస్ట్రేషన్ విలువలు పెంచింది. ఇప్పటి వరకు ఒకే ఏడాది మూడు దఫాలుగా ఏ ప్రభుత్వమూ పెంచిన దాఖలాలు లేవు... ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప! మొదటి నుంచి ప్రజలపై భారాలు వేయడంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి అదే తరహాలో భారం మోపనుంది. ఇప్పటికే విద్యుత్ చార్జీల మోతతో అల్లాడిపోతున్న ప్రజలు మరో బాదుడుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ విలువలు జనవరి నుంచి అమలుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు
షెడ్యూల్ ఇదీ...
ఈ నెల 18వ తేదీకి మార్కెట్ విలువలను నిర్ధారిస్తారు. 19న ఈ ప్రతిపాదనలను సంబంధిత కమిటీ ఆమోదిస్తుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిపార్టుమెంట్ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను అభ్యంతరాలు, సూచనల కోసం ఉంచుతారు. వాటిని 24వ తేదీలోగా స్వీకరిస్తారు. మార్పుచేర్పులు ఉంటే 26లోగా పూర్తి చేస్తారు. 27వ తేదీన తుది ఆమోదం కోసం మళ్లీ కమిటీ ముందు ఉంచుతారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త విలువలు అమలులోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment