ఎట్టకేలకు రైతును కలిసిన ఉప ముఖ్యమంత్రి
మంగళగిరి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి అన్నదాతల సమస్యలు విన్నవించేందుకు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వచ్చిన రైతు నవీన్‌కుమార్‌కు ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ దర్శనమిచ్చారు. సాక్షి దినపత్రికలో మంగళవారం ‘సమస్యలు పరిష్కరించాలి ఎడ్ల బండి కట్టి’ అంటూ ప్రచురితమైన కథనానికి స్పందించిన ఉప ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం నవీన్‌కుమార్‌ను కలిశారు. అనంతరం నవీన్ కుమార్ మాట్లాడుతూ.. దళారుల బెడద తప్పించాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్‌లో విక్రయించుకునేలా చూడాలని కోరారు. వినతిపత్రాన్ని కార్యాలయంలో ఇవ్వాలని తెలపగా, ఆ మేరకు అందజేసినట్లు తెలిపారు.
ఎన్‌సీసీ కోటాలో అగ్రిసెట్ ప్రవేశాలకు కౌన్సెలింగ్
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరానికి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ఎన్‌సీసీ కోటాలో అగ్రిసెట్ 2024 ద్వారా ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు విఽశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ను సంప్రదించాలన్నారు.
18 నుంచి లెవెల్ క్రాసింగ్ గేటు మూసివేత
లక్ష్మీపురం: మంగళగిరి నుంచి నిడమర్రు వరకు రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో మూడు రోజుల పాటు నంబూరు–మంగళగిరి మధ్య లెవెల్ క్రాసింగ్ గేటును మూసి వేయనున్నట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ మంగళవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు లెవెల్ క్రాసింగ్ గేటు మూసి వేయడం వల్ల ట్రాఫిక్‌ను డాన్ బాస్కో స్కూల్– నవలూరు సెంటర్ – క్రికెట్ స్టేడియం రోడ్డు –నిడమర్రు మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.
ఉపాధి పనులలో నిర్లక్ష్యం తగదు
మాచర్ల రూరల్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులందరూ సమష్టిగా పనిచేయాలని పల్నాడు జిల్లా ఏపీడీ కొరటా మల్లికార్జునరావు కోరారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, కొప్పునూరు, తాళ్ళపల్లి, చింతలతండ, నాగులవరం గ్రామాలలో మినీ గోకులం షెడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. డివిజన్‌లో మినీ గోకులం షెడ్ల నిర్మాణం కోసం తలపెట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరికీ పని కల్పించేలా ఉపాధి హామీ పనులు అందించాలని కోరారు. గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలకమైందని, ఈ పనులను నిర్వాహణలో అలసత్వం ప్రదర్శించవద్దని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి జవాబుదారీతనంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీఓ శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్ గోవిందు, ఇంజినీర్ గోపి, ఫీల్డ్ అసిస్టెంటు మరియదాసు, నాయక్‌లు ఉన్నారు.
వైభవంగా ఆరుద్రోత్సవం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలో ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో త్రికోటేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అభిషేకాలు నిర్వహించారు. చివరగా అన్నాభిషేకం జరిపిన అనంతరం స్వామికి విశేష పుష్పాలంకరణ చేశారు. తెల్లవారుజాము వరకు జరిగిన అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment