మెరుగైన వైద్య సేవలకు చర్యలు
గుంటూరు మెడికల్: గతంలో గుంటూరు జీజీహెచ్‌లో రోడ్డు ప్రమాద బాధితులకు, కత్తిపోట్లకు గురైన వారికి, పాము కాటు బాధితులకు, ఇతర అత్యవసర వైద్య సేవలు అందించేందుకు క్యాజువాల్టీ మాత్రమే ఉండేది. జీజీహెచ్‌లో డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణ సమయంలో 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు రోడ్డు ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అందించేందుకు ట్రామాకేర్ సెంటర్లను మంజూరు చేసింది. దీని కోసం ప్రత్యేకంగా నిధులు, వైద్య పరికరాలు, సిబ్బందిని కేంద్రం కేటాయించింది. ట్రామా కేర్ సెంటర్‌లో న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ లాంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులను సైతం నియమించింది. మెరుగైన వైద్యం సకాలంలో అందించి, ప్రాణాలు కాపాడేందుకు ట్రామా కేర్ సెంటర్ వైద్యులు పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టుల భర్తీకి చర్యలేవీ?
గుంటూరు జీజీహెచ్ ట్రామా కేర్ సెంటర్‌లో 71 పోస్టులకు గాను 20 పోస్టులు రెండేళ్లకుపైగా ఆసుపత్రి అధికారులు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వం ప్రతినెలా జీరో వేకెన్సీ పాలసీతో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయమని చెప్పినప్పటికీ జీజీహెచ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనే తీవ్ర విమర్శలకు ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల ఖాళీలతో సేవల్లో కొంత మేరకు జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందితో పనిచేయించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ట్రామాకేర్ సిబ్బంది సొంత ప్రాక్టీస్‌లో మునిగి తేలుతూ జీజీహెచ్‌కు వచ్చే బాధితులపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ ఉన్నప్పటికీ దానిని వినియోగించడం లేదు. సకాలంలో ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడాల్సిన థియేటర్ నిర్వహణలో నిర్లక్ష్యమే అధికారుల పనితీరుకు ఒక నిదర్శనంగా చెప్పవచ్చు.
సీఎంఓలు ఉన్నా ప్రయోజనం శూన్యం
క్యాజువాల్టీలో ప్రమాద బాధితులు, అత్యవసర చికిత్స బాధితులు రాగానే క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) సదరు రోగికి ప్రాథమిక చికిత్స అందించాలి. మెరుగైన చికిత్స కోసం స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులను, డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్, డ్యూటీ అసిస్టెంట్ సర్జన్‌లను ఫోన్ కాల్ ద్వారా క్యాజువాల్టీకి పిలిపించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రోగి, బాధితులు కొంత మేర కుదటపడిన తర్వాత మెడికో లీగల్ కేసులకు (ఎంఎల్సీ) డాక్యుమెంటేషన్ సిద్ధం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. క్యాజువాల్టీలో సీఎంఓలుగా విధులు నిర్వహిస్తున్న వారు కేవలం మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి జేబులు నింపుకొనే పనిలో ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఎల్సీ కేసులు క్యాజువాల్టీకి వచ్చినప్పుడు పోలీసు సమాచారం మాత్రం సిద్ధం చేసి, మిగతా చికిత్సలు తమకు సంబంధం లేదన్నట్లుగా బాధితులను వేచి చూసేలా చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. దీంతో ఎమర్జెన్సీ చికిత్సల కోసం వచ్చే రోగుల ప్రాణాలకు గ్యారంటీ ఉండటం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. క్యాజువాల్టీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు.
జీజీహెచ్‌లో ఎమర్జెన్సీ చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌ను సైతం వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. ఆపరేషన్లు కూడా సత్వరమే జరిగేలా చూస్తామన్నారు.
– సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ
Comments
Please login to add a commentAdd a comment