విద్యుత్ ఆదాతో భావితరాలకు మేలు
గుంటూరు వెస్ట్: భావితరాలు మనుగడ సాగించాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే విద్యుత్ ఆదా చేయాల్సిన సామాజిక బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ర్యాలీని కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ ఆదాపై అనేక అవగహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే గృహోపకరణాలు ప్రజలు వినియోగించాలని సూచించారు. సౌర విద్యుత్‌ను కూడా విస్తృతంగా ఉపయోగించుకోవాలి. పీఎం సూర్య గృహ పథకం కింద జిల్లాలో ఇంటిపై కప్పుపై సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు ఇప్పటి వరకు 5,900 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 594 మంది ఇన్‌స్టాలేషన్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. చిత్రలేఖనం, వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో విజేతలను అభినందించారు. వీరిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులకు 48 గంటలలోపే వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని తెలిపారు. 17 శాతం వరకు తేమ ఉన్న ధాన్యానికి కూడా ఎంఎస్పీ ధర అందిస్తున్నామని చెప్పారు. ఎంత ధాన్యాన్నైనా కొంటామని కలెక్టర్ వివరించారు. అనంతరం ఎస్‌బీఐ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అధికారులతో, ప్రజలతో విద్యుత్ ఆదాపై కలెక్టర్, జేసీ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఏవీఎల్‌ఎన్ మూర్తి, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment