ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం
తెనాలిఅర్బన్: తెనాలి పురపాలక సంఘంలో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్‌లను సమయానికంటే ముందుగా ఇవ్వటం పరిపాటిగా మారింది. ఎవరైనా గుర్తిస్తే చెల్లించిన నగదును వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాసిమళ్ళ కిషోర్ మున్సిపల్ కార్మికుడు కాగా, 24 సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్‌ను 2019లో ఇవ్వాల్సి ఉంది. కానీ మున్సిపల్ కార్యాలయంలో ఆ సమయంలో పనిచేసిన క్లర్క్ అతనికి 2018లోనే ఇంక్రిమెంట్‌ను జీతంతో కలిపి విడుదల చేశారు. అప్పటి నుంచి అతడు ఆ ఇంక్రిమెంట్ నగదు డ్రా చేస్తూ వచ్చాడు. 2024లో 30 సంవత్సరాల ఇంక్రిమెంట్ ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నాడు. ఆయన అభ్యర్థన మేరకు క్లర్క్ బిల్లు తయారు చేసి సబ్ ట్రెజరీ కార్యాలయానికి పంపారు. అక్కడున్న ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్‌ను పరిశీలించారు. 2025లో ఇంక్రిమెంట్ వేయాలని, ఈ ఏడాది కాదంటూ రిమార్కు రాసి వెనక్కి పంపారు. అప్రమత్తమైన సదరు క్లర్క్ ఏడాది ముందుగా ఇంక్రిమెంట్ నగదు చెల్లించామని బాధితుడికి తెలిపారు. ఆ నగదు రూ.3 లక్షలు వెంటనే వెనక్కి ఇవ్వాలని కోరారు. తన దగ్గర డబ్బులు లేవని బాధితుడు చెప్పాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే పనిలో క్లర్క్ ఉన్నట్లు సమాచారం. అలాగే ఆ సమయంలో ఇదే విధంగా మరో పది మంది కార్మికులకు ఇంక్రిమెంట్ ముందుగా వేశారనే ప్రచారం జరుగుతోంది. అప్పటి క్లర్క్ ముందుగా ఇంక్రిమెంట్ వేయడానికి కొంత నగదు తీసుకున్నాడనే ఆరోపణలున్నాయి. కమిషనర్ బండి శేషన్నను వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. క్లర్క్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు.
ముందుగానే ఇంక్రిమెంట్ జమ ఎవరైనా ఫిర్యాదు చేస్తే నగదు వెనక్కి
Comments
Please login to add a commentAdd a comment