హత్య కేసులో నిందితులు అరెస్టు
పట్నంబజారు: యువకుడిపై దాడి చేసి హతమార్చిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వై.వీరసోమయ్య తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 17తేదీ రాత్రి తెనాలి చెంచుపేటకు చెందిన చప్పిడి దీపక్ (27)ను కొంత మంది వ్యక్తులు తీవ్రంగా గాయపరిచి గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించగా అతడు మృతి చెందాడు. జీజీహెచ్ అధికారుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. మృతుడు దీపక్ అలియాస్ నానిగా గుర్తించారు. గత ఏప్రిల్‌లో తెనాలిలో స్నేహితుడు గద్దల కిరణ్ రూ. 54 వేలను దీపక్‌కు ఇచ్చాడు. అప్పటి నుంచి డబ్బులు అడుగుతుంటే దీపక్ మాట దాటవేస్తూ వస్తున్నాడు. కిరణ్ ఈ నెల 16వ తేదీ రాత్రి దీపక్‌ను తెనాలి నుంచి మాయమాటలు చెప్పి బార్‌లో మద్యం తాగించాడు. గుంటూరులో మందు పార్టీ ఉందని చెప్పి నమ్మబలికాడు. అప్పటికే ఉద్దేశపూర్వకంగా హత్య చేయాలని పక్కా ప్రణాళికతో ఉన్న కిరణ్.. తన స్నేహితులను సిద్ధం చేశాడు. ఆ మేరకు దీపక్‌ను వారితో కలిసి లాలాపేటకు చెందిన బూసా రవిశంకర్, పాతగుంటూరు గాంధీ బొమ్మ సెంటర్‌కు చెందిన షేక్ అక్బర్, పాతగుంటూరు కుమ్మరి బజారుకు చెందిన నల్లమేకల అశోక్, నల్లమేకల గోపి, వినోభానగర్‌కు చెందిన షేక్ ఫెరోజ్, బాలాజీనగర్‌కు చెందిన మాల్య వెంకట సాయికుమార్‌లు.... బాలాజీనగర్ జీరోలైను రాజీవ్ గృహకల్ప సమీపంలోని ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం మరింత మద్యం తాగించి తనకు రావాల్సిన నగదు గురించి దీపక్‌ను కిరణ్ అడిగాడు. ఇప్పుడు లేవని, తరువాత ఇస్తానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ నేపథ్యంలో కిరణ్, దీపక్ మధ్య ఘర్షణ జరిగింది. మరో నిందితుడు రవిశంకర్ మెడలోని గోల్డ్‌చైన్‌ను సైతం దీపక్ లాగడంతో తెగిపోయింది. చైన్ ఒక ముక్క రవిశంకర్ చేతికి, మరో ముక్క దీపక్ వద్ద ఉండటంతో ఇవ్వమని అడగ్గా ఈ విషయంలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో గద్దల కిరణ్, రవిశంకర్, మిగిలిన వారందరూ కలిసి కర్రలు, బెల్టుతో క్రూరంగా కొట్టి గాయపరిచారు. 16వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్పృహ తప్పి కింద పడిన దీపక్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లి చప్పిడి వెంకటరెడ్డి పేరుతో చేర్పించారు. తర్వాత పరారయ్యారు. చికిత్స పొందుతూ 17వ తేదీ ఉదయం దీపక్ మృతి చెందాడు. మృతుడి తండ్రి చంద్రశేఖరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నందివెలుగు రోడ్డులోని వాటర్ ట్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు ఈ హత్యకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్సైలు షేక్ అబ్దుల్ రహమాన్, ఎన్.సి. ప్రసాద్, హెడ్‌కానిస్టేబుళ్లు కె.కోటేశ్వరరావు, ఎం.డి.నూరుద్దీన్, కె.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు జి.శ్రీనివాస్, పి.మురళీలను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment