ఏసుక్రీస్తు మార్గంలో నడవాలి
గుంటూరు వెస్ట్: సర్వ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలంటే ఏసుక్రీస్తు చూపిన శాంతి, ప్రేమ మార్గాల్లో నడవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, క్రైస్తవ మైనార్టీ ఆర్థిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రైస్తవంలో ఉన్న ప్రేమ, కరుణ కులమతాలకతీతంగా అందరూ పాటిస్తే సమాజంలో ఎలాంటి విభేదాలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యం, భక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ మాదిగ కార్పొరేషన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ చైర్‌పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, డెప్యూటీ మేయర్ షేక్ షజిల, ఫాదర్ ఇన్నయ, పరదేశిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment