రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలూ ముఖ్యం
కొరిటెపాడు: నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఏపీ ఎంఎస్‌ఎంఈ డీసీ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. ‘లఘు ఉద్యోగ భారతి’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి యోగీష్ చంద్ర అధ్యక్షతన శుక్రవారం ‘ఎంఎస్‌ఎంఈ సంగమం 2024’ కార్యక్రమం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివశంకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... నూతన పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం వాటి ఏర్పాటుకు అనుకూల వాతావరణం సృష్టించడంతోపాటు పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక భద్రత, అన్ని ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఎంఎస్‌ఎంఈ ఉద్యమ్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకొని ప్రోత్సాహకాలకు అర్హత సాధించాలని సూచించారు. చిన్న తరహా పరిశ్రమల సమస్యలను లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షుడు మాదల వెంకటేశ్వరరావు వివరించారు. తులసి గ్రూప్ అధినేత తులసి యోగీష్ చంద్ర మాట్లాడుతూ ఏపీఐఐసీ ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడల్లో ప్లాట్స్ సద్వినియోగం అయ్యేలా చూడాలని కోరారు. పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం 5 శాతం నుంచి 12 శాతానికి జీఎస్‌టీ పెంచటం తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment