అభివృద్ధికి క్రీడలూ కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ, రాష్ట్ర అభివృద్ధికి క్రీడలు, సాంస్కృతిక అంశాలు వంటివి దోహదం చేస్తాయని రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వి పేర్కొన్నారు. అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను ‘ఆదర్శ్ 2024 స్పోర్ట్స్ ఫర్ హార్మనీ’ పేరుతో శుక్రవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తేజస్వి జాతీయ, క్రీడా పతాకాలు ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పావురాలను ఎగురవేశారు. తేజస్వి మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఆశిస్తున్న అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్రీడాకారులు తయారవ్వాలని కోరారు. అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, పీవీ సింధు, హారిక వంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. చదువు నేర్పని అద్భుతాలు క్రీడలు, సాంస్కృతిక అంశాలు నేర్పుతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములను ఆస్వాదించాలని వివరించారు. అనంతరం తేజస్వి బాలికల కబడ్డీ పోటీలను స్వయంగా ఆడి ప్రారంభించారు. విశిష్ట అతిథిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ కేవీఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రమణారావు, ఎంఎస్‌కే ప్రసాద్ వంటి క్రీడాకారులు హిందూ సంస్థల పూర్వ విద్యార్థులేనన్నారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ.. పోటీలకు 25 కళాశాలల నుంచి 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారని తెలిపారు. రెండు రోజులపాటు ఈ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి.ఐజక్ ప్రసాద్ మాట్లాడుతూ.. క్రీడలతోపాటు మానసిక వికాసానికి దోహదపడే సాంస్కృతిక పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపల్ వజ్రాల నర్సిరెడ్డి, డాక్టర్ కొల్లా సుస్మితా చౌదరి, ఫిజికల్ డైరెక్టర్ కోసూరి రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment