ప్రొటోకాల్‌పై రగడ
సాక్షి ప్రతినిధి గుంటూరు, నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌సీపీ పాలకవర్గం ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆ పార్టీ కార్పొరేటర్లను, ఏకంగా మేయర్‌ను ఆహ్వానించకపోవడం శుక్రవారం కౌన్సిల్ వేదికగా రెండు గంటలపాటు చర్చకు దారితీసింది. దీంతోపాటు టౌన్‌ప్లానింగ్ అవినీతి, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల ప్రక్షాళన, తాగునీటి అంశంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. గోరంట్లలో సీసీ రోడ్డు శంకుస్థాపనకు మేయర్‌ను ఆహ్వానించకపోవడంపై కార్పొరేటర్ మొహమూద్ ప్రశ్నించారు. దీనికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. తమనూ పిలవడం లేదని ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న అధికారులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోడియం దగ్గరకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను తాము అధికారుల చుట్టూ తిరిగి చేయించుకుంటే ఎమ్మెల్యేలు టెంకాయ కొట్టి వెళ్లిపోతున్నారని కార్పొరేటర్లు బూసి రాజలత, మల్లవరపు రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు సమాధానం ఇస్తూ ప్రొటోకాల్ అంశంపై ఒక ఫార్మెట్ రెడీ చేసి, ఆ విధంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేయర్ మాట్లాడుతూ... అధికారులు ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారని మండిపడ్డారు. నాయకుల మధ్య వివాదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌కు తెలియకుండా ప్రియాంబుల్స్ ఏ విధంగా పెడతారంటూ ప్రశ్నించారు.
టౌన్ ప్లానింగ్ విభాగంపై ఆగ్రహం
21వ డివిజన్‌లో అక్రమ కట్టడాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని, అధికారులకు చెప్పినా కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని కార్పొరేటర్ గురవయ్య ప్రశ్నించారు. కార్పొరేటర్ చిష్టీ మాట్లాడుతూ అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వస్తే భవన యాజమాని వద్ద మామూళ్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏమైనా ఆధారాలు అందజేయాలని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం వలన చాలా వాణిజ్య సముదాయాలు నష్టపోయే ప్రమాదం ఉందని, వారికి నష్టపరిహారం గురించి తెలియజేయాలన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయకుండా ఏవిధంగా సమావేశాలు నిర్వహిస్తారని కార్పొరేటర్లు వెంకటకృష్ణ (ఆచారి), బూసి రాజలత, ఇతర సభ్యులు ప్రశ్నించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కాదని స్టేక్ హోల్డర్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిప్తాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన సమావేశాలకు ప్రజా ప్రతినిధులను పిలవకుండా డీపీఆర్ ఏ విధంగా సిద్ధం చేస్తారని అధికారులను ప్రశ్నించారు. అందరి భాగస్వామ్యంతో బ్రిడ్జి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు.
కౌన్సిల్ సమావేశంలో రెండు గంటలపాటు సాగిన చర్చ టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతిపై విరుచుకుపడిన సభ్యులు ప్రజాప్రతినిధుల సూచనలతో బ్రిడ్జి డీపీఆర్ తయారీకి తీర్మానం
Comments
Please login to add a commentAdd a comment