ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి
గుంటూరు వెస్ట్: శంకర్ విలాస్ సెంటర్లో త్వరలో నిర్మించనున్న ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరిగింది. రోడ్లు, భవనాల శాఖాధికారులు, డీపీఆర్ కన్సల్టెన్సీలతో కలిసి రెండు డిజైన్లు రూపొందించారు. మొదటిది దాదాపు కిలోమీటరు పొడవుతో అరండల్‌పేట 10వ లైను నుంచి ఉమెన్స్ కాలేజీ వరకు ప్రతిపాదించారు. రెండోదానిలో హిందూ కళాశాల వరకు ప్రతిపాదన సిద్ధం చేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా, మ్యాప్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణంలో ఐకానిక్ ఆర్కిటెక్చర్ ప్రతిబింబించేలా చూడాలన్నారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్లే వాహనాలకు ఇబ్బందులు రాకుండా ఫ్లైఓవర్ నిర్మాణంలో అండర్‌పాస్ మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉమెన్స్ కాలేజ్ నుంచి ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రతిపాదనలు డిజైన్ చేయాలని చెప్పారు. దీని కోసం కాలేజీ వద్ద 24 గంటల సర్వే నిర్వహించి 24వ తేదీన నివేదిక అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి, ఈఈ విశ్వనాథ రెడ్డి, రైల్వే డీఈఎస్ భరత్ కుమార్, కన్సల్టెన్సీ ప్రతినిధులు నరేంద్ర, ప్రణీత్, కుటుంబ రావు పాల్గొన్నారు.
నాణ్యమైన ఇసుకను గుర్తించండి
గ్రామ, మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలతో విస్తృత తనిఖీలు నిర్వహించి 5 హెక్టార్లు పైబడిన నాణ్యమైన ఇసుకను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వారంలోపే ఈ ఇసుక వివరాలు అందజేయాలన్నారు. లిటిగేషన్స్ లేకుండా చూడాలని పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా మైన్స్ అండ్ జియాలటీ అధికారి డి.వెంకట సాయి, డీపీఓ బి.వి.నాగసాయి కుమార్ , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment