వసతి సరిలేదు..సం‘క్షేమం’ కానరాదు
సమస్యల సుడిగుండంలో తాడికొండలోని వసతి గృహాలు
ఆయా వసతి గృహాల వార్డెన్లు ఏమన్నారంటే...
తాడికొండ: పేద విద్యార్థులు కాసింత తలదాచుకొని పాఠశాలల్లో ఉచిత విద్యనభ్యసించేందుకు ప్రభుత్వాలు ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్మాణమే తప్ప తదనంతరం వాటికి కనీస మరమ్మతులు చేసిన నాథుడు లేకపోవడంతో విద్యార్థులకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. తాడికొండ బీసీ బాలికల వసతి గృహంలో 98 మంది విద్యార్థినులు ఉంటుండగా ఇక్కడ ఫ్లోరింగ్ పూర్తిగా కుంగిపోయి ఎగుడుదిగుడుగా మారడంతో కనీసం నడవాలన్నా చిన్నారులు ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరుగుదొడ్ల తలుపులు బోల్టులు ఊడిపోయి వేలాడుతూ దర్శనమిస్తుండగా మరుగుదొడ్ల నుంచి బయటకు వెళ్లే డ్రైనేజీకి సక్రమమైన వ్యవస్థ లేని కారణంగా ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. దీనిపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కార మైన దాఖలాలు లేని కారణంగా విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ పరిశీలనలో సైతం ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకూ పట్టించుకున్న నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళాశాల బాలుర వసతి గృహంలో సైతం..
కళాశాల బాలుర వసతి గృహంలో సైతం సమస్యలు ఎక్కడికక్కడే తిష్టవేసి దర్శనమిస్తున్నాయి. నిర్మాణమే తప్ప కనీస మరమ్మతులకు కూడా నోచని కారణంగా ఎక్కడ చూసినా గోడలి బీటలు వారి కనిపించడంతో పాటు, అంతర్గత గదుల్లో ఫ్లోరింగ్ పూర్తిగా కుంగిపోయి చిన్నారులు ఎగుడుదిగుడుగా పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంపై పలువురు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మరుగుదొడ్లుపై ఉన్న శ్లాబ్ పూర్తిగా పాడైపోవడంతో వర్షం పడితే మరింత ఇబ్బందిగా మారుతుందని, తాగునీరు మంచినీరు అందని కారణంగా ఉప్పునీరు కొన్ని అవసరాలకు వాడుతున్నామని పలువురు ఆవేదన చెందుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించి నాణ్యమైన వసతులతో విద్యనందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడం తమను నిర్లక్ష్యం చేయడమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతవేటు దూరంలో సీఎం నివాసం, విద్యాశాఖా మంత్రి చేరువలో ఉన్నా తమకీ దుస్థితి నుంచి బయటపడేసే నాధుడే లేడా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా స్పందించి సత్వరమే సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
కళాశాల బాలుర వసతి గృహంలో పెచ్చులూడి, ఫ్లోరింగ్ కుంగి అధ్వానంగా మారిన ఆవరణ
కనీస మరమ్మతులు లేక గుంతలమయంగా మారిన లోగిళ్లు కుంగిన ఫ్లోరింగ్, మరుగుదొడ్లు అపరిశుభ్రం డ్రైనేజీ నీరు బయటకు వెళ్లే దారిలేక.. తాగునీరు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
బీసీ బాలికల వసతి గృహం వార్డెన్ మార్గరేట్ మాట్లాడుతూ ఇటీవల జిల్లా కలెక్టర్ పరిశీలనకు రాగా విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లామని, వేసవిలో పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తామని తెలిపారు. కళాశాల బాలుర వసతి గృహం వార్డెన్ విజయ్ భాస్కర్ స్పందిస్తూ సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, మరమ్మతుల నిమిత్తం రూ.23 లక్షలు మంజూరయ్యాయని, ఇటీవల ఇంజినీరింగ్ విభాగం అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారన్నారు. వేసవిలో మరమ్మతులు నిర్వహిస్తుమని చెప్పినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment