మన దేశం సర్వమత సమ్మేళనం
తాడేపల్లి రూరల్ : మన భారత దేశం సర్వమత సమ్మేళనం అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి అన్నారు. బుధవారం మంగళగిరిలోని బాపూజీ విద్యాలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా 10వ పాశురాన్ని భక్తులకు స్వామి వారు వివరించారు. క్రిస్మస్ సందర్భంగా యావత్ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో తరాలుగా ఎటువంటి భేదం లేకుండా అంతా ఈ దేశంలో నివసిస్తున్నామని, ముందు ముందు కూడా ఇలానే కలసి మెలసి ఉండాలని ఆయన అన్నారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా విజయవాడ, నరసరావుపేట, మచిలీపట్నం ప్రాంతాల నుంచి సుమారు 280 మంది భక్తులు గోదా అమ్మ వారికి సారె సమర్పించారని తెలిపారు.
దేవాలయంలో
సంకీర్తన గానం
తెనాలి: పట్టణంలోని నెహ్రూరోడ్డులో శ్రీరుక్మిణి సమేత గోవర్ధన స్వామి– శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో బుధవారం సాయంత్రం శ్రీహరినామ సంకీర్తన బృందంచే సంకీర్తన గానం జరిగింది. గురువు పెరవలి వంశీకృష్ణ, అందె బాలచంద్రమౌళి, అందె రాజేశ్వరి, తన్మయి మాదల సాయి హనుమంతరావు, నాగఅర్చన, రూపశ్రీ, నందిపాటి దుర్గామల్లేశ్వరి, దంటు శర్వాణి, పువ్వాడ విష్ణుప్రియ, శ్రీపూజిత, కొప్పురపు అనిత మాధవి, నంది కంటి జయలక్ష్మి, పూజిత, టీవీఎస్ శాస్త్రి సంకీర్తనలో గానం చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో ‘వారం వారం భజన’లో భాగంగా శ్రీఆంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే బృందంచే ఈనెల 27న తిరుమలలో భక్తిరంజని ఉంటుందని గురువు పెరవలి వంశీకృష్ణ తెలియజేశారు.
నేడు లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు
గుంటూరు రూరల్: నల్లపాడు గ్రామం వెంగళాయపాలెం రోడ్డులోని స్వయంభూ శ్రీ పుష్పాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ, అన్న సంతర్పణ ఉంటాయని పేర్కొన్నారు.
ఓం శ్రీఅమ్మయే శరణం తిరుపతాంబ
వైభవంగా తిరుపతమ్మ మండల దీక్షలు
పెనుగంచిప్రోలు: ఓం శ్రీఅమ్మయే శరణం తిరుపతాంబ... ఓం శ్రీస్వామియే శరణం గోపయ్య... అంటూ అమ్మవారి శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ మండల దీక్ష మాలధారణ బుధవారం వైభవంగా ప్రారంభమైంది. తొలుత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఎదుట ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ కిషోర్‌కుమార్, ప్రధానార్చకుడు మర్రెబోయిన గోపిబాబు సమక్షంలో అర్చకులు సూరిబాబు, ప్రసాద్ ముందుగా మాల వేసుకుని మాలధారణ ప్రారంభించారు. అనంతరం ఆలయ అర్చకులు మాల వేసుకున్నారు. మొదటి రోజు సుమారు1000 మందికి పైగా మాలలు వేసుకున్నారు. దీక్షాధారులకు సింగరాయకొండకు చెందిన శివమ్మస్వామి దంపతులు ఉచితంగా పులిహోర, లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బెజవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment