జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలు అరికట్టేందుకు అధికారులందరూ సమష్టి కృషితో, ప్రణాళికతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్‌పీఆర్‌బీ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీ అడిక్షన్ సెంటర్‌లలో మాదక ద్రవ్యాలు వినియోగించి చికిత్స కోసం వచ్చే రోగుల వివరాలు పోలీసులకు అందించాలన్నారు. విద్యాసంస్థలు, పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టేందుకు స్థానికులకు అవగాహనతో పాటు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు కలిపి పాఠశాలల్లో నార్కోటింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణ కోసం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మెడికల్ షాపుల్లో వైద్యుల సిఫార్సు లేకుండా మత్తు కలిగించే డ్రగ్స్ విక్రయించరాదని తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల క్రయ, విక్రయాలను కఠినంగా అణచి వేస్తున్నామన్నారు. మాదకద్రవ్యాలు వినియోగించేవారితోపాటు, విక్రయించేవారితో కూడా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. డీఈఓ రేణుక, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూధనరావు, డీఆర్‌డీఏ పీడీ డాక్టర్ విజయలక్ష్మి, ఫుడ్ కంట్రోల్ ఏడీ లక్ష్మణ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment