వినియోగదారుల చట్టాలపై అవగాహన అవసరం
గుంటూరు వెస్ట్: వినియోగదారుల చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ వినయోగదారుల దినోత్సవ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ మనిషి పుట్టుకతోనే వినయోదారునిగా జీవితం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి వ్యక్తి తాము కొనుగోలు చేసిన చిన్న, పెద్ద వస్తువుల నాణ్యతను చూసుకునే హక్కు ఉంటుందన్నారు. తమకు ఎలాంటి అన్యాయం జరిగినా తక్షణం వినియోగదారుల కమిషన్‌లో కేసు నమోదు చేయాలన్నారు. దీనికి ఖర్చు కూడా నామమాత్రంగానే ఉంటుందన్నారు. జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ ఫోరంలో నమోదు చేసిన కేసులు త్వరగానే పరిష్కారమవుతాయన్నారు. వినియోగదారుల హక్కులను వినియోగించుకుంటే వ్యాపారులు కూడా అప్రమత్తంగా ఉంటారని చెప్పారు. వినియోగదారుల హక్కుల అంశంలో చిన్నారులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో 36 మందికి బహుమతులు ప్రదానం చేశారు. సమావేశంలో డీఎస్‌ఓ కోమలి పద్మ, సివిల్ సప్లయీస్ డీఎం లక్ష్మి, ఆహార భద్రతా శాఖాధికారి రవీంద్రా రెడ్డి, వినియోగదారుల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఆదామ్ సాహెబ్, వినియోగదారుల కమిషన్ సభ్యురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment