కాల్వలో దూకి జంట ఆత్మహత్యాయత్నం
ఒకరు మృతి... మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం
బొల్లాపల్లి: నాగార్జున సాగర్ కుడి కాలువలో ఓ జంట దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు వినుకొండ పట్టణంలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బండ్లమోటు ఎస్‌ఐ ఎ.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా వెల్లటూరు గ్రామానికి చెందిన గోవిందు నాగరాజు (41), వినుకొండ పట్టణంలో నివాసం ఉంటున్న వి.భార్గవి వివాహేతర సంబంధం నేపథ్యంలో విడిపోతామని మనస్థాపానికి గురై వెల్లటూరు సమీపంలోని బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన స్థానికులు కాలువలో నుంచి ఇరువురిని బయటకు తీయగా అప్పటికే నాగరాజు మృతి చెందాడు. భార్గవి వినుకొండలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఇరువురి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ఇరువురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో భార్గవి భర్త ఫిర్యాదు మేరకు వినుకొండ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. మృతుడు నాగరాజు భార్య సువర్ణలత కుటుంబ మనస్పర్థలతో నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మృతునికి సంతానం లేక దత్తత తీసుకోవడం జరిగింది. ఇరువురు విడిపోతామనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి బాబాయి జి.లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని వినుకొండకు పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం కుటుంబసభ్యులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment