గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంచుకుని జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించి, ముందుకు వెళ్లినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని సీఐడీ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ కేజీవీ సరిత పేర్కొన్నారు. సోమవారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో గోరంట్లలోని భాష్యం రామసేతు క్యాంపస్ సమీపంలోని జేఎస్‌ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో బీపీఎల్ 2024–25లో భాగంగా భాష్యం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ లెవల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రిలిమినరీ మ్యాచ్‌లను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ సరిత మాట్లాడుతూ అపజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేటి యువత క్రికెట్‌ను కేవలం క్రీడగానే పరిగణించాలని, జట్టును స్ఫూర్తివంతమైన నాయకత్వ లక్షణాలతో నడిపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. క్రమశిక్షణ పట్టుదల, పోరాట పటిమ వంటి లక్షణాలను పెంచుకోవడంతోపాటు శారీరక, మానసిక పటిష్టానికి సహకరిస్తుందన్నారు.
క్రీడా స్ఫూర్తిని పెంచేందుకే లీగ్
భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు భాష్యం ప్రీమియర్ లీగ్‌ను ప్రారభించామని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న అధికారికంగా 150 క్యాంపస్‌లలో ప్రారంభించిన పోటీలు మూడు వేర్వురు కేటగిరీల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం 720 మ్యాచ్‌లలో బ్రాంచ్ స్థాయిలో 420, జోనల్ స్థాయిలో 281, సెంట్రల్‌స్థాయిలో 19 మ్యాచ్‌లు జరుగుతాయని వివరించారు. సెంట్రల్ టోర్నమెంట్‌లో భాగంగా ప్రిలిమినరీలు ఈనెల 20న ప్రారంభం కాగా, ఈనెల 23న క్వార్టర్ ఫైనల్స్, ఈనెల 25న సెమీ ఫైనల్స్, 26న ఫైనల్స్ నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా ఎస్పీ సరిత చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి, జెండాలతోపాటు బెలూన్లు ఎగురవేశారు. అనంతరం ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఉదయం గుంటూరు జెయింట్స్–3, వైజాగ్ వికింగ్స్–1 మధ్య జరిగిన మ్యాచ్‌లో గుంటూరు జెయింట్స్ జట్టు, మధ్యాహ్నం గుంటూరు గార్డియన్స్–2, తూర్పు గోదావరి ఎలైట్స్–3 మధ్య జరిగిన మ్యాచ్‌లో గుంటూరు గార్డియన్స్–2 జట్టు విజయం సాధించాయి. విజేతలకు భాష్యం రామకృష్ణ ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్‌రామ్, ప్రిన్సిపాల్స్, టీచర్లు పాల్గొన్నారు.
సీఐడీ ఎస్పీ కేజీవీ సరిత భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభోత్సవం
Comments
Please login to add a commentAdd a comment