వృద్ధుల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
ఎస్పీ సతీష్‌కుమార్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ సతీష్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల గోడు ఆలకించారు. ఎస్పీ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వృద్ధుల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని చెప్పారు. శిక్షణ ఐపీఎస్ శ్రీదీక్ష, ఏఎస్పీ(క్రైం) కె.సుప్రజ, డీఎస్పీలు రమేష్, శివాజీరాజు అర్జీలు స్వీకరించారు.
ఎక్కువ వడ్డీ ఆశ చూపి మోసం
విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి ఎక్కువ వడ్డీ ఆశ చూపడంతో విడతల వారీగా రూ.59 లక్షలు చెల్లించాం. కొంతకాలం వడ్డీలు క్రమంగా చెల్లించి ఆ తర్వాత ఆపేశాడు. గతేడాది ఆగస్టులో అడిగితే చెల్లించేస్తానని నమ్మబలికాడు. కానీ చెల్లించలేదు. మోసపోయాం. అతనిపై ఇటీవల నగరంపాలెం పీఎస్‌లో ఫిర్యాదు చేశాం. ఎటువంటి స్పందన లేదు. న్యాయం చేయండి.
– ఓ యువతి, రామిరెడ్డినగర్, ఏటీ అగ్రహారం
భర్త మోసగించాడని..
నా భర్త మరొక యువతితో కలిసి ఉంటున్నాడు. నన్ను మోసం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. న్యాయం చేయండి
– ఓ వివాహిత, ఐపీడీ కాలనీ, సంగడిగుంట
రూ.10.40 లక్షలు తీసుకుని..
రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి తన కుమార్తె అవసరాల నిమిత్తం రూ.10.40 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్లు గడిచినా డబ్బులు చెల్లించలేదు. అదేమని అడిగితే బెదిరిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. న్యాయం చేయండి.
– ఎన్.వెంకటరావమ్మ, గుంటూరు వారితోట
వీఆర్వో మోసగించాడు
యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో గతేడాది జూన్‌లో పరిచయమయ్యాడు. వంకాయలపాడు గ్రామంలో పొలం ఉందని చెప్పి నమ్మబలికాడు. అగ్రిమెంట్ రాయిస్తానని చెబితే రూ.3 లక్షలు చెల్లించాను. పొలం ఆన్‌లైన్ చేయించి ఇస్తానని చెప్పి, మరో రూ.17 లక్షలు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆన్‌లైన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేయలేదు. పెదకాకానిలోని వీఆర్వో ఇంటికెళ్లగా ఆయన కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడారు. తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
– షేక్.మౌలా బుడే,
బొప్పూడి గ్రామం చిలకలూరిపేట
నిందితులను అరెస్ట్ చేయాలి
శ్రీదేవి ఓ సీడ్స్ కంపెనీ సేల్స్ విభాగంలో పనిచేసేది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమెకు బంధువులు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షలు వడ్డీకి ఇప్పించారు. వడ్డీ చెల్లించినా అసలు చెల్లించలేదని వడ్డీకి ఇచ్చిన వ్యక్తి శ్రీదేవి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బంధువులూ అతనికి వత్తాసు పలికారు. ఆమె మనస్తాపం చెంది గతేడాది నవంబర్‌లో పురుగు మందు తాగి మరణించింది. అంతకుముందు వీడియో కాల్‌లో పురుగు మందు డబ్బా పట్టుకుని, తన చావుకు ఎవరెవరు కారణమనేది తెలిపింది. అయినా పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదు. న్యాయం చేయాలి.
– శ్రీదేవి భర్త ఆనంద్, తనయులు,
పలు సంఘాల నేతలు
Comments
Please login to add a commentAdd a comment