జీఎంసీ కమిషనర్ అవినీతిపై పోరాటం ఆగదు
గుంటూరు వెస్ట్ : జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వ్యవహార శైలి, అవినీతి విస్మయానికి గురి చేస్తోందని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని మేయర్‌తోపాటు డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబు( డైమండ్ బాబు), కార్పొరేటర్లు కలిశారు. కమిషనర్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మేయర్ మాట్లాడుతూ గత ఏడాది బుడమేరు వరదల సహాయార్థం కమిషనర్ కౌన్సిల్‌కు చెప్పకుండా రూ.9.24 కోట్లు అక్రమ చెల్లింపులు చేశారన్నారు. ప్రశ్నించినందుకు తమపై అకారణంగా కక్ష పెంచుకున్నారన్నారు. కమిషనర్ అవినీతిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించాలని కోరారు. కమిషనర్ అవినీతిపై తమ పోరాటం ఆగదని, కలెక్టర్ నుంచి ప్రధాన మంత్రి వరకు ఫిర్యాదులు చేస్తామన్నారు.
టీడీపీ నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారు
బుడమేరు వరద సహాయక చెల్లింపులు చేసింది కమిషనర్ పులి శ్రీనివాసులేనని, వాటి చెల్లింపుల వివరాలు, పరిస్థితులు ఆయనే చెప్పాలని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబు(డైమండ్ బాబు) డిమాండ్ చేశారు. కేంద్ర గ్రామీణ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు ముగ్గురు శాసన సభ్యులను, టీడీపీ నాయకులను, అధికారులను కమిషనర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు ఈచంపాటి ఆచారి, మార్కెట్ బాబు, పడాల సుబ్బారెడ్డి, అచ్చాల వెంకటరెడ్డి, రోషన్, బూసి రాజలత, వేముల జ్యోతి, అడకా పద్మ, గురవయ్య, దూపాటి వంశీ, అంబేడ్కర్, యాట్ల రవి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, యెక్కలూరి కోటి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు
గుంటూరు వెస్ట్: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కొందరు అధికారులు అలసత్వం వహిస్తున్నారని, ఇలా అయితే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ వేదిక ప్రాముఖ్యతను అధికారులు గుర్తించాలన్నారు. చిన్న సమస్యల పరిష్కారానికీ కొందరు అధికారులు అర్జీదారుడిని పదే పదే తిప్పుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా సిబ్బంది అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. తమ అర్జీలను ప్రజలు స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చన్నారు. అనంతరం వచ్చిన 172 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
మేయర్ కావటి, డెప్యూటీ మేయర్ డైమండ్ బాబు
నా బిడ్డకు పూర్తి పింఛన్ మంజూరు చేయండి
నా బిడ్డకు ఇప్పటికీ 20 ఏళ్ళు వచ్చాయి. నూరు శాతం అంగవైకల్యం ఉంది. ప్రస్తుతం రూ.6 వేలు పింఛన్ వస్తుంది. నూరు శాతం వైకల్యముంటే రూ.15 వేలు ఇవ్వాలి. నా బిడ్డ మందులకు, అనారోగ్య సమస్యలకు కొంత సాయంగా ఉంటాయి. దయచేసి మంజూరు చేయండి.
– షేక్ శిలార్, పర్వీన్ దంపతులు,
ఓబులనాయుడు పాలెం.
అప్పు ఇచ్చి మోసం చేశారు
నా బిడ్డకు తీవ్ర అనారోగ్యం. అతని వైద్యం కోసం బంధువుల వద్దే రూ.3 లక్షలు అప్పుచేశా. దీంతో వారు నా 1.33 ఎకరాల భూమిని కాజేశారు. మాకు ఉపాధి కూడా లేదు. ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నారు. న్యాయం చేయండి.
– వసుంధర, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment