అక్రమ నిర్మాణంపై దేవదాయ అధికారుల తనిఖీ
కొల్లిపర: కొల్లిపరలో అనుమతుల్లేకుండా జరుగుతున్న భవన నిర్మాణాన్ని దేవదాయ శాఖ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన బొంతు జగదీశ్వరరెడ్డి నిర్మిస్తున్న మూడంతస్తుల భవనం స్థలం శ్రీపోతురాజుస్వామి దేవాలయానికి చెందిందని, అక్కడ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవంటూ కుంచెల వెంకటరామిరెడ్డి ఏపీసీఆర్‌డీఏ, తెనాలి జోనల్ కార్యాలయానికి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు దేవదాయశాఖ సహాయ కమిషనరు జి.మాధవి, తెనాలి దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ ఎస్.శారదదేవి, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి గ్రామానికి వచ్చారు. పంచాయతీ కార్యదర్శి అలకనంద, వీఆర్‌వో భాస్కర్‌తో కలిసి సంబంధిత ప్రదేశాన్ని, నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఇప్పటికే గ్రామపంచాయతీ, రెవెన్యూ అధికారులు బొంతు జగదీశ్వరరెడ్డికి నోటీసులు ఇచ్చి భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయించినట్టు తెలుసుకున్నారు అనంతరం ఆలయ కమిటీ పెద్దలు, స్థానిక నివేశనదారులతో మాట్లాడారు. దేవాలయ రికార్డులను పరిశీలించారు. సంబంధిత భూమి అంతా గ్రామకంఠంలో ఉందని నిర్ధారించుకున్నారు. అనంతరం దేవాదాయశాఖ సహాయ కమిషనరు జి.మాధవి మాట్లాడుతూ కొల్లిపరలోని శ్రీపోతురాజుస్వామి గుడి దేవదాయశాఖ పరిధిలో లేదన్నారు. ఆలయానికి చెందిన స్థలంగా పేర్కొంటున్న గ్రామకంఠంలో దాదాపు 50 మంది గ్రామస్తులు నివాసగృహాలను నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్నారని వివరించారు. వీటికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. ఆలయ కమిటీ పెద్దలు, అక్కడ నివసిస్తున్న గ్రామస్తులు కలసి మాట్లాడుకుని పదిరోజుల్లో తగిన నిర్ణయం తీసుకుని నివేదించాలని సూచించారు. లేకుంటే నివాసాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల వెంట తూములూరు దేవాదాయశాఖ ఈవో ప్రసాద్ , దేవాలయం కమిటీ సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment