కౌలు రైతులకు బ్యాంకు రుణాలు
గుంటూరు రూరల్: భూ యజమానులు రుణాలు తీసుకోకుండా ఉంటే గుర్తింపు కార్డులున్న కౌలు రైతులకు ఈ రబీలో పంట రుణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో వ్యవసాయశాఖ, బ్యాంక్, రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ భూ యజమానులు కౌలు రైతులకు సహకారం అందిస్తే బ్యాంకు రుణాలు అధిక మొత్తంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో 40,000 మంది గుర్తింపు కార్డులు పొందితే అందులో 12 వేల మంది భూ యజమానులు రుణాలు పొందకుండా ఉన్నారని చెప్పారు. ఎటువంటి ష్యూరిటీ లేకుండా భూమి లేని కౌలు రైతులకు గ్రూపుల ద్వారా రూ.రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ మాట్లాడుతూ కౌలు రైతులందరికీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కౌలు రైతులు లీడ్ బ్యాంకు మేనేజర్‌కు తమ సమస్యలు విన్నవించారు. అనంతరం లీడ్ బ్యాంకు మేనేజర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో అజయ్, ఏడీఏ శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఇమ్మడి రామారావు, సర్పంచ్ మబ్బు శిరీష, ఉపసర్పంచ్ శ్రీనివాసరావు, కౌలు రైతులు, రైతులు పాల్గొన్నారు.
లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment