![కవిరాజు త్రిపురనేని సాహిత్యం నిత్య నూతనం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/30/29gwe15-150106_mr-1738181947-0.jpg.webp?itok=SbgWOfh-)
కవిరాజు త్రిపురనేని సాహిత్యం నిత్య నూతనం
గుంటూరు ఎడ్యుకేషన్: కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం నిత్య నూతనంగా వెలుగుతుందని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు అన్నారు. బుధవారం జేకేసీ కళాశాల ఆడిటోరియంలో కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘‘సూత పురాణం’’ శత వసంతాల వేడుక సందర్భంగా కవిరాజు త్రిపురనేని పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సాహితీ సమితి గౌరవాధ్యక్షుడు గద్దె మంగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేవరాజు మహారాజు, ప్రజా సాహితీ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబుకు కవిరాజు త్రిపురనేని పురస్కారాలను ప్రదానం చేశారు. ఈసందర్భంగా దేవరాజు మహారాజు మాట్లాడుతూ ఆధునిక కాలానికి కవిరాజు త్రిపురనేని సాహిత్యం ఎంతో అవసరమని చెప్పారు. ఆయన రచనలు నేటి తరానికి మార్గదర్శకమన్నారు. సమాజం హేతుబద్ధ పద్ధతిలోనే నడవాలని ఆయన కాంక్షించారని, మానవత్వమే ఆయన మతమని అన్నారు. కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ హేతుబద్ధ ఆలోచనలతో మనిషిగా మనిషిగా గౌరవించాలని త్రిపురనేని కాంక్షించారని అన్నారు. త్రిపురనేని రామస్వామి వందేళ్ల క్రితం రచించిన సూత పురాణాన్ని కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి వెలుగులోకి తీసుకురావడం, ఆయన పేరుతో పురస్కారాన్ని ప్రదానం చేయడం గొప్ప విషయమన్నారు. త్రిపురనేని ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అనంతరం చిట్టినేని లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన ‘‘కవిరాజు విజయం’’ సాహితీ పద్య రూపకం టెలీఫిలిం ప్రదర్శించారు. ఈసందర్భంగా ప్రజా గాయకుడు పీవీ రమణ బృందం కవిరాజు గీతాలాపాన చేశారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, సమితి అధ్యక్షుడు ఆలోకం పెద్దబ్బయ్య, పూర్వాధ్యక్షులు బైరపనేని నరేష్, జొన్నలగడ్డ రామారావు, ఉపాధ్యక్షులు రావెల సాంబశివరావు, కార్యదర్శి వల్లూరు తాండవకృష్ణ, సంయుక్త కార్యదర్శి పారా అశోక్, కోశాధికారి పాటిబండ్ల విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవరాజు మహారాజు
Comments
Please login to add a commentAdd a comment