నేటినుంచి ‘రైల్వే’ ఎన్నికలు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో రైల్వే ఎన్నికల కోలాహలం నెలకొంది. నేటినుంచి మూడు రోజులపాటు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రైల్వే వన్ ఇండస్ట్రీ వన్ యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైల్వే ట్రేడ్‌యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్ల హోరు చూస్తుంటే రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నడు లేని విధంగా రైల్వే జంక్షన్ ప్రాంగణం, రైల్వే కాలనీల్లో రైల్వే నాయకుల ఎన్నికల పోస్టర్లు పోటాపోటీగా దర్శనమ్మివడంతో అందరు షాక్ అవుతున్నారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాన్ని మైమరమించేలా రైల్వే ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుందని అటు రైల్వే కార్మికులు ఇటు ప్రజలు బాహటంగా చెప్పుకుంటున్నారు.
ఎన్నికలు ఇలా..
రైల్వే మజ్దూర్ యూనియన్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, దక్షిణ మధ్య రైల్వే కార్మిక్ సంఘ్, ఐఆర్‌ఎంయూ, ఆర్‌ఎంయూ దక్షిణ మధ్య రైల్వేలో పోటీ చేస్తున్నాయి. డిసెంబర్ 4, 5వ తేదీన జనరల్ పోలింగ్, 6వ తేదీన రన్నింగ్ స్టాఫ్‌కు పోలింగ్ ఉంటుంది. రైల్వేశాఖలో గుర్తుంపు కోసం వన్ ఇండస్ట్రీ వన్ యూనియన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలో 30 లేక 35 శాతం ఓటింగ్ వచ్చిన రైల్వే సంఘానికి ప్రధాన గుర్తింపు లభిస్తుంది. గతంలో 2007లో, 2013లో ఈ ఎన్నికలు జరుగగా ఇప్పుడు 2024లో జరుగుతున్నాయి. కాజీపేట జంక్షన్‌లో వివిధ రైల్వే డిపోలలో పని చేస్తున్న వారితో కలుపుకుని మొత్తం 3 వేలకు పైచిలుక ఓటర్లు ఉన్నారని, కాజీపేటలో ఐదు పోలిగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు రైల్వే నాయకులు తెలిపారు. కాగా, కార్మికులను కాకా పట్టడానికి రైల్వే నాయకులు పలు చోట్ల గిప్ట్‌లు, పార్టీలు, వాట్సాప్ గ్రూప్‌ల ప్రచారం, మద్యం పంపిణీతో గాలం వేస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. కొందరు వాట్సాప్‌లో నీవెంత అంటే నీవెంత అని తిట్ల పురాణం చేసుకుటున్నారని అంటున్నారు. మూడు రోజుల జరిగే ఎన్నికల సమరానికి ఐక్యతతో ఉండే కార్మికులు అంతర్యుద్దాల వరకు వెళ్లొద్దని, అలాంటి వాటికి పులిస్టాప్ పెట్టాలని పలువురు రైల్వే రిటైర్డ్ నాయకులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా కార్మికులకు సేవ చేసే రైల్వే నాయకులు కార్మికుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకునేలా హుందాగా ఉండి కార్మిక విలువలు, నైతిక బాధ్యతతో ఆదర్శంగా ఉండాలని పలువురు సీనియర్స్ అంటున్నారు.
పోస్టర్లమయంగా రైల్వే కాలనీలు
హోరాహోరీగా ఫ్లెక్సీల ప్రచారం
నేటినుంచి మూడు రోజులపాటు పోలింగ్
కాజీపేటలో 3 వేల పైచిలుకు ఓటర్లు
ఐదు పోలిగ్‌బూత్‌ల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment