విజయ డెయిరీలో చోరీ
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ అలంకార్ జంక్షన్ సమీపంలోని ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ చాంబర్, డెయిరీ మేనేజర్, మరో అధికారి గదుల్లో చొరబడిన దొంగ.. బీరువాలు తెరిచి రికార్డులు చిందరవందరగా పడేసి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు డెయిరీ పరిసరాలను పరిశీలించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. డెయిరీ మేనేజర్ ప్రదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హనుమకొండ పోలీసులు విచారణ చేపడుతున్నారు. డెయిరీ సిబ్బంది కథనం ప్రకారం, సీసీ ఫుటేజీ ఆధారంగా తెలిసిన వివరాలు ఇలా ఉన్నా యి. బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి తాళం పగులగొట్టి జూనియర్ మేనేజర్ గదిలోకి చొరబడి అందులోని బీరువా తెరిచి ఫైళ్లు వెతికాడు. అనంతరం డెయిరీ మేనేజర్ గదిలోని బీరువానూ చిందరవందరగా చేశాడు. ఇక్కడి టేబుల్ లోపల ఉన్న చి ల్లర నగదు తీసుకున్నాడు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ గదిలోకి వెళ్లి పైళ్లు చిందరవందరగా పడేశాడు. దొంగకు నగదు లభించకపోవడం.. ఫైళ్లు మాత్రం అక్కడే వదిలేసి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇదీ ఇంటి దొంగల పనా లేదా బయటి వ్యక్తులుచేసిన పనా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలపాటు వాహనాలు, సిబ్బంది ఉండే డెయిరీలో దొంగ చొరబడడం ఆరు దశాబ్దాల సంస్థ చరిత్రలో ఇదే ప్రథమంగా పేర్కొన్నారు. డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రవణ్‌కుమార్ సోమవారం నుంచి సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయనను వివరణ కోరగా చోరీ జరిగిన విషయం తెలిసిందన్నారు.
ఇంటి దొంగలపై అనుమానాలు?
ఆధారాలు సేకరించిన క్లూస్‌టీం
Comments
Please login to add a commentAdd a comment