ఉమ్మడి వరంగల్ జిలాల్లో పలు మార్గాల్లో గత ఏడాది వరకు బస్సులతోపాటు ఆటోలు పోటీపోటీగా నడిచేవి. అనేక మంది నిరుద్యోగ యువత ఆటో డ్రైవింగ్ వృత్తి పై ఆధారపడి జీవనం సాగించేవారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో గిరాకీలేక ఆటో డ్రైవర్ల జీవనం దయనీయంగా మారింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 45 వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఇందులో ట్రైసిటీలో 12వేల ఆటోలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళా ప్రయాణికులు ఆటోను ఆశ్రయించడం లేదు. ఫలితంగా గిరాకీ లేక ఆటోడ్రైవర్లు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ట్రైసిటీలో వరంగల్ నుంచి కాజీపేట వరకు వేలాదిగా నడిచే ఆటోలు ప్రస్తుతం సరైన గిరాకీలేకపోవడంతో డ్రైవర్లు వృత్తికి దూరమవుతున్నారు. ఇతర గ్రామాల్లో సైతం ఆటో డ్రైవర్లకు తిప్పలు తప్పడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో, బస్సులు నడవని మార్గాల్లో మాత్రం కొద్దిగా మెరుగు ఉంది. ట్రైసిటీతోపాటు జిల్లా కేంద్రాల్లో ఆటో డ్రైవర్లకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఆటో డ్రైవింగ్ వృత్తిని నమ్మకున్న వారి సంఖ్య పడిపోయింది. ఇతర పనులకు వెళ్తుండడంతో ఆటోల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment