సీకేఎం ఆస్పత్రి ఏఓ సరెండర్
ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిని కలెక్టర్ డాక్టర్ సత్య శారద రెండు రోజుల క్రితం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో శానిటేషన్, సెక్యూరిటీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గుర్తించిన కలెక్టర్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వెలుగుచూసిన పలు ఘటనల నేపథ్యంతో ఏఓ సాజిద్‌ను సరెండర్ చేయాలని ఆమె డీఎంఈకి సిఫారసు చేశారు. ఏఓను కలెక్టర్ ఆదేశాలు ఆస్పత్రిలో చర్చనీయాంశంగా మారాయి.
లేఅవుట్ అనుమతులు మంజూరు
వరంగల్: కమిటీలో చర్చించి లేఅవుట్ అనుమతులు మంజూరు చేసినట్లు కోసం కలెక్టర్ సత్య శారద తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన లేఅవుట్ కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో లేఅవుట్ అనుమతుల కోసం వచ్చిన ప్రతిపాదనలను చర్చించి అనుమతి మంజూరు చేశామన్నారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీటీసీపీ రత్నకుమారి, జీడబ్ల్యూఎంసీ అదనవు కమిషనర్ జోనా, సిటీ ప్లానర్ రవీందర్, జిల్లా రోడ్లు, భవనాల అధికారి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రెడ్ క్రాస్‌లో ‘సీనియర్ సిటిజన్స్ క్లినిక్’
హన్మకొండ అర్బన్: వయోవృద్ధుల ఆరోగ్య సంక్షేమం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ భవన్‌లో సీనియర్ సిటిజన్స్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు రెడ్ క్రాస్ బాధ్యులు తెలిపారు. ఈ క్లినిక్ ద్వారా వయోవృద్ధులకు అనుభవజ్ఞులైన డాక్టర్ల ద్వారా ఉచిత కన్సల్టెన్సీలతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్‌లో తక్కువ ధరలకే రక్త పరీక్షలు, జనరిక్ మందుల షాపులో తక్కువ ధరలకే మందులు లభించనున్నట్లు తెలిపారు.
స్విమ్మింగ్ పోటీలకు
ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని
కేయూ క్యాంపస్: చైన్నెలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థిని వర్షిణిప్రియ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి తెలిపారు. ఈమేరకు ఆ విద్యార్థిని బుధవారం అభినందించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లా రమేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కావ్యకు ప్రథమ బహుమతి
హన్మకొండ కల్చరల్: భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని హనుమంతరాయ గ్రంథాలయంలో అక్కినేని కళావేదికపై జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వరంగల్ ఫ్రెండ్స్ కల్చరల్ సంస్థకు చెందిన కావ్య టింగిల్‌కార్ వీరనారి రుద్రమదేవి ఏకపాత్రాభినయ పాత్ర పోషించి ప్రథమస్థానంలో నిలిచి బహుమతి అందుకున్నారు.
‘రైతులు అధైర్యపడొద్దు’
వర్ధన్నపేట: నియోజకవర్గ వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి అపోహలకు గురికావొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. రుణమాఫీ కాని రైతులు బ్యాంకు, పట్టా పాస్‌బుక్, ఆధార్‌కార్డు, రుణం పొందిన బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన పత్రాలను నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులకు అందజేయాలని సూచించారు.
నిట్ స్పోర్ట్స్ అసిస్టెంట్‌కు డాక్టరేట్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.రాకేష్‌కు కర్ణాటకలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అందజేసింది. ఎఫెక్ట్ ఆఫ్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అండ్ కంటిన్యూయస్ ట్రైనింగ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎరోబిక్ ఎండ్యూరెన్స్ అండ్ ఎనరోబిక్ ఎండ్యూరెన్స్ అమంగ్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్స్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై చేపట్టిన పరిశోధనకు డాక్టరేట్ అందుకున్నట్లు రాకేష్ వివరించారు.
లావాదేవీలను బహిర్గతం చేయాలి
వరంగల్ చౌరస్తా: ప్రజల నుంచి వసూలు చేసిన రూ.75 లక్షల సొమ్ము వివరాలపై ప్రశ్నిస్తే కక్షపూరితంగా తమను సీపీఎం నుంచి వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్.రంగయ్య సస్పెండ్ చేశారని బహిష్కృత నేతలు ముక్కెర రామస్వామి, మాలోతు సాగర్ వాపోయారు. హంటర్‌రోడ్డులో ఓ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. 30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ కష్టపడుతున్నామన్నారు. చెప్పుడు మాటలతో సరైన ఆధారాలు చూపలేక, నోటీసులు జారీ చేయకుండా ప్రకటించడం సరికాదన్నారు. సమావేశంలో ఓదెలు, ప్రత్యూష్య, జ్యోతి, దాసు, రత్నం, మాధవి, మైరున్నీసా, లావణ్య, రఘుపతి, రాఘవరెడ్డి, యాకమ్మ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment