విద్యార్థులను బడికి పంపడం అందరి బాధ్యత
● ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్య శారద
● అధికారులతో సమీక్ష
హన్మకొండ అర్బన్: జిల్లాలోని 6–14 ఏళ్ల విద్యార్థులు పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బడి బయటి విద్యార్థుల గుర్తింపునకు చేపట్టనున్న ప్రత్యేక సర్వేపై బుధవారం కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఒక నెల కంటే ఎక్కువ గైర్హాజరైన విద్యార్థులను బడి బయటి విద్యార్థులుగా గుర్తించాలని, 15–19 మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు చదువు ఆపేస్తే వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యాభ్యాసం కొనసాగించడానికి ప్రేరేపించాలని సూచించారు. సర్వే నిర్వహణ, అవసరమైన ప్రొఫార్మాలు, సూచనలను డీఈఓ వాసంతి ఆయా శాఖల అధికారులకు తెలిపారు. ఇటుక బట్టీలు, పని ఆవాసాలు, వలస వచ్చే కార్మికులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి సర్వే చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గుణాత్మక విద్య సమన్వయ అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి జయంతి, పోలీస్ కమిషనరేట్ నుంచి వెంకన్న, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment