‘గ్రేటర్ వరంగల్’లో ‘పట్టణ ప్రణాళిక’ తీరు ఇది
బహుళ అంతస్తుల్లో భారీగా మోసాలు
కమర్షియల్ కట్టడాల్లో అడిగినంత..
తెరవెనుక చక్రం తిప్పుతున్న కొందరు కార్పోరేటర్లు
అనుమతి లేని నిర్మాణాలపై పెద్ద ఎత్తున బేరసారాలు
క్షేత్రస్థాయి సిబ్బందికి వసూళ్ల టార్గెట్.. కుదరకపోతే నోటీసులు, కూల్చివేతలు
‘గ్రేటర్’లో చర్చనీయాంశంగా అక్రమ నిర్మాణాలు
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ అర్బన్: ● వరంగల్ చౌరస్తాలో ఓ బడా వ్యాపారి కమర్షియల్ భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారు. నిబంధనల్ని పక్కన పెట్టి ఉపయోగించుకుంటున్నారు. అధికారులు సరిగ్గా ఏడాది కిందట నోటీసు జారీ చేసి, స్వల్పంగా కూల్చేసి చేతులు దులుపుకున్నారు.
● వరంగల్ రోడ్డులోని ఓ థియేటర్ సమీపంలో పత్రాలు పరిశీలించకుండానే ఇంటి నంబర్, పేరు మార్పిడి, కమర్షియల్ కాంప్లెక్స్‌కు అనుమతులిచ్చారు. దీని వెనుక కొందరు కార్పొరేటర్లు, ఓ కీలక ప్రజాప్రతినిధి రూ.లక్షలు గడించారన్న ఆరోపణలున్నాయి.
.. ఇలా హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రై సిటీలో కీలక రహదారులు, జంక్షన్లలో పదుల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. టౌన్ ప్లానింగ్, అనుమతుల నిబంధనలు గాలికి వదిలేసి నిర్మాణాలు చేస్తూ బల్దియా ఆదాయానికి గండికొడుతున్నారు. ఈకీలక నిర్మాణాల వెనుక కొందరు కార్పొరేటర్లు, కీలక ప్రజాప్రతినిధులు, పాలకవర్గం పెద్దలు ఉండడంతో అటు అధికారులు, ఇటు సిబ్బంది నోరు మెదపడం లేదు.
ఇదీ వసూళ్ల లెక్క..
● వ్యక్తిగత నివాసం (అనుమతులు ఉన్నా, లేకున్నా) నిర్మించుకున్నా కొందరు కార్పొరేటర్లు, వారి అనుచరుల ద్వారా రూ.10 వేల నుంచి రూ.30 వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బల్దియా గ్రీవెన్స్‌లోనూ ఇటీవల కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు.
● అపార్ట్‌మెంట్ (బిల్డర్ నిర్మిస్తే) నిర్మిస్తే చాలు. కనీసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ముట్టజెప్పాల్సిందే. ఇది చాలా డివిజన్లలో ఒక రూల్‌గా మార్చేశారు.
● బహుళ అంతస్తుల భవనంలో ఒక అంతస్తు అదనంగా నిర్మిస్తే మినిమమ్ రూ.3 వేల నుంచి రూ. లక్ష నజరానా. లేదంటే టౌన్‌ప్లానింగ్ అధికారులను మధ్యన పెట్టి కొందరు కార్పొరేటర్లు పనులు ఆపడం వంటివి చేసినట్లు కూడా ఫిర్యాదులున్నాయి.
● ఇవే కాకుండా.. ఆయా డివిజన్‌లో ప్రాతినిథ్యం వహించే కార్పొరేటర్.. పార్టీ చేపట్టే కార్యక్రమాలు, సమావేశాలు, సభలు, నిరసన కార్యక్రమాలు, పండుగలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నారు.
● భవన నిర్మాణానికి అనుమతి లేకపోతే ఆ ఏరి యా కార్పొరేటర్‌కు కాసులు కురిసినట్లే. జీ ప్లస్ 2, 3, 4కు రూ.20వేల నుంచి రూ.60వేల వరకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని కొందరు భవ న నిర్మాణదారులు బహిరంగంగా చెబుతున్నా రు. అద్దె, పారిశ్రామిక,వాణిజ్య,అగ్రికల్చర్, ఎఫ్ టీఎల్, బఫర్, పబ్లిక్ అండ్ సెమి పబ్లిక్, గ్రీనరీ స్థలాల్లో భవనం కడితే అడిగినంత ఇవ్వాల్సిందే. ఆ లెక్కన రూ.లక్షల్లోనే ఉంటుంది. కానీ,టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం నిబంధనల ప్రకార మే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని,అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడి తే నోటీసులు ఇచ్చి ఆపేస్తున్నామని చెబుతున్నారు.
మీకింత.. మాకెంత?
‘తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే..’ అన్న రీతిగా గ్రేటర్ వరంగల్‌లో నీ.. నా తారతమ్యం లేకుండా కొందరు కార్పొరేటర్ల వసూళ్లు కొనసాగుతున్నాయి. ఫలితంగా నగరంలో రోజురోజుకూ అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తనకు తెలిసిన వారైనా, బంధువులు అయినా.. ఇల్లు కట్టినా, అపార్ట్‌మెంట్ నిర్మించినా, అక్రమమైనా.. నిబంధనలు అతిక్రమించినా.. ఏదైనా సరే. భవన నిర్మాణాల ఫొటోలు తీస్తున్నారు. అధికారుల తరహాలో బిల్డింగ్ పర్మిషన్ తీసుకురమ్మని బెదిరిస్తున్నారు. లోకల్ కార్పొరేటర్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లతో సంతృప్తికరంగా మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. కూల్చేస్తే ఏమొస్తుందని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్ చైన్‌మెన్లు, శానిటరీ జవాన్లు, డివిజన్లలో చోటా, మోటా నేతలు చివరికి బిల్ కలెక్టర్లు వసూళ్ల రాయుళ్లుగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment