నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పెద్దపులి పాదముద్రలను పరిశీలిస్తున్న ఎఫ్‌ఆర్‌ఓ రవికిరణ్
నల్లబెల్లి, కొత్తగూడ మండలాల్లో సంచారం
భయం గుప్పిట్లో రెండు మండలాల జనం
పెద్దలొద్ది అటవీ ప్రాంతంలో ఆడపులి, పులి పిల్ల.. కొండాపూర్, మూడుచెక్కలపల్లి, రుద్రగూడెం, కోనాపురంలో మగపులి పాదముద్రలు
వ్యవసాయ పనులకు వెళ్లని రైతులు, కూలీలు
నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్, మూడుచెక్కలపల్లి, రుద్రగూడెం, కొండాయిల్‌పల్లి గ్రామాల శివారులో, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం అటవీప్రాంతంలో పులుల సంచారం వార్త కలకలం రేపుతోంది. ఈ రెండు మండలాల్లో ఓ ఆడపులి, పిల్ల పులి, మరో మగ పులి సంచారం నిర్ధారణ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొండాపూర్ గ్రామానికి చెందిన మల్లబోయిన కొమురయ్య రోజు మాదిరిగానే గురువారం తనకున్న 150 మేకలను పెద్దలొద్ది అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లాడు. అడవి జంతువును తింటున్న పెద్ద పులిని చూసి మేకలు, కుక్క భయపడి బెదిరి చెల్లాచెదురయ్యాయి. పెద్దలొద్ది అవతలి ఒడ్డున పెద్దపులి కనిపించడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కొమురయ్య వెనుదిరిగాడు.
పొలాల నుంచి వెనుదిరిగిన రైతులు
నల్లబెల్లి మండలంలోని వ్వయసాయ పొలాల వద్ద పులి పాదముద్రలను గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన నర్సంపేట ఎఫ్‌ఆర్‌ఓ రవికిరణ్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది కొండాపూర్, మూడుచెక్కలపల్లి, రుద్రగూడెం గ్రా మాలను సందర్శించారు. అటవీ ప్రాంతం, పంట పొలాల్లో గాలింపు చేపట్టారు. కొండాపూర్ పెద్దలొద్ది అటవీ ప్రాంతంలో ఆడపులి, పులిపిల్ల పాదముద్రలు ఉండగా, కొండాపూర్, మూడుచెక్కలపల్లి, రుద్రగూడెం గ్రామాల్లోని పంట పొలాల్లో, కొత్తగూడ మండలం కోనాపురం ముసలి మడు గు అటవీ ప్రాంతంలోని పొలాల్లో మగపులి పాదముద్రలను సేకరించారు. చివరగా ఆడపులి తన పిల్లతోపాటు, మగపులి కోనాపూర్ అటవీప్రాంతానికి వేర్వేరుగా వెళ్లినట్లు చెబుతు న్నారు. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, కూలీలు పెద్దపులుల సంచారం విషయం తెలియడంతో పనులు చేయలేమని వెనుదిరుగుతున్నారు. కూలీల భయాన్ని అర్థం చేసుకున్న రైతులు చేసేదేమిలేక మిన్నకుండిపోతున్నారు.
పులి తిరుగుతోంది.. జాగ్రత్త : గ్రామాల్లో పోలీసుల దండోరా
నల్లబెల్లి మండలంలో పెద్ద పులుల సంచారంతో పోలీస్ అధికారులు గ్రామాల్లో దండోరా వేయించారు. ‘పంట పొలాల్లో పెద్ద పులుల సంచారం ఉంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. రెండు రోజుల వరకు రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లొద్దు.. రాత్రి వేళ ఒంటరిగా వెళ్లొద్దు.. ఒక వేళ పెద్దపులులు కనిపిస్తే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.. పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చవద్దు’ అని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment