సైబర్ క్రైం పోలీసులకు చిక్కిన 85 మందిలో 70 మంది అక్కడివారే
నిందితులు చదివింది టెన్త్, ఇంటర్.. మరికొందరు టెన్త్ డ్రాపవుట్స్
అత్యధికంగా పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్టులు
24 గంటల్లో 1930కి కాల్ చేసిన బాధితులకే రికవరీ
2023 సంవత్సరంతో పోల్చితే తగ్గిన నేరాలు, రికవరీ
సాక్షి, వరంగల్: వారు చదివింది పదో తరగతి, ఇంటర్.. ఇంకొందరైతే టెన్త్ డ్రాపవుట్స్.. అంటే వీరికి పెద్ద పరిజ్ఞానం ఉంటుందిలే అనుకుంటున్నారా.. రాజస్థాన్‌కు చెందిన దాదాపు 70 మంది నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వందలాది మంది బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు లాగేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ హనుమకొండ, వరంగల్‌లోని చదువుకున్న వారి ఆశలను క్యాష్ చేసుకుంటున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024లో 772 కేసులు నమోదైతే.. ఛేదించిన 114 కేసుల్లో 85 మందిని అరెస్టు చేశారు. వీరిలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్, జోధ్‌పూర్ నగరాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు చెందిన 70 మంది ఉండడం గమనార్హం. అంటే పెద్దగా చదువుకోకున్నా సాంకేతికతను అందిపుచ్చుకొని నయా మోసాలు చేస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. చదువుకున్న వారు వీరి చేతిలో మోసపోవడం స్వయంకృతాపరాధమేనని పోలీసులు అంటున్నారు.
ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లలో రికవరీ తక్కువ..
తక్కువ డబ్బులతో పెట్టుబడి.. ఒక్కరోజులోనే రెండింతలు.. అంటూ వివిధ ప్రముఖ కంపెనీల పేర్లతో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లు చేస్తున్నారు. ఆరంభంలో రూ.100 పెడితే రూ.200 రావడంతో ఇది నిజమని నమ్మిన వందలాది మంది రూ.వేలు, రూ.లక్షల వరకు పెట్టుబడి పెట్టాక అసలు మోసం అర్థం అవుతుంది. లాభాలు దేవుడెరుగు కానీ పెట్టిన డబ్బులు కూడా పోవడంతో అది మోసమని ఆలస్యంగా గుర్తిస్తున్న ప్రజలు సైబర్ క్రైం పోలీసులను సంప్రదిస్తున్నారు. ఆ రోజు ఫిర్యాదు చేస్తే ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటే అక్కడివరకే పోలీసులు 1930 ద్వారా ఆయా బ్యాంకుల ఖాతాలను ఫ్రీజ్ చేయగలుగుతున్నారు.
ఇన్వెస్ట్‌మెంట్ మోసం ఆలస్యంగా గుర్తిస్తుండడంతో ఈ కేసుల్లో భారీగా రికవరీ సాధ్యపడడం లేదని సైబర్ క్రైం ఏసీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆ తర్వాత లోన్ యాప్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఫేస్‌బుక్ ఛీటింగ్.. ఇలా వివిధ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సైబర్ క్రైం పోలీసు స్టేషన్ ప్రారంభించడంతో ప్రాధాన్యం ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి సారించాం.. ఒక డీఎస్పీ, ఇద్దరు ఎస్సైలు, 8 మంది కానిస్టేబుళ్లతో సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు.
అప్రమత్తతతోనే భారీగా రికవరీ
నాలుగు నెలల క్రితం ఓ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌కు ఫోన్ వచ్చింది. మీ బ్యాంక్ ఖాతాలో హవాలా కమీషన్ వచ్చి చేరింది.. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తామంటూ సీబీఐ, ఈడీ ఆఫీసర్లుగా భయభ్రాంతులకు గురిచేశారు. ఆ డబ్బులు మా బ్యాంకు ఖాతాకు పంపితే పరిశీలించి తిరిగి ఇస్తామని మాటలతో నమ్మించారు. ఇది నిజమనుకున్నా సదరు ప్రొఫెసర్ రూ.8 లక్షల వరకు పంపించారు. ఆ తర్వాత మోసమని తెలుసుకొని గంటల వ్యవధిలో వరంగల్ సైబర్ క్రైం పోలీసులను సంప్రదించారు.
1930 ద్వారా పూర్తి వివరాలు ఇవ్వడంతో నిందితుడి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయగలిగారు. అప్పటికే రూ.మూడు లక్షలను దుబాయ్‌లో డ్రా చేశారు. మిగిలిన రూ.ఐదు లక్షలను స్తంభింపజేయడంతో ఆ డబ్బులు తిరిగి కోర్టు ద్వారా బాధితుడికి అందాయి. ఈ ఏడాది ఇదే అతి పెద్ద భారీ రికవరీ అని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. మోసం జరిగిన 24 గంటల్లో ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బు రికవరీ సాధ్యమవుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment