హనుమకొండ వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉద్యోగుల తిష్ట
చర్చనీయాంశమైన గత అధికారి మౌఖిక ఆదేశాలు
వెలుగులోకి వస్తున్న అవినీతిఅక్రమాలు
ఎంజీఎం: హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్ సిబ్బంది హవా కొనసాగుతోంది. గతంలో పనిచేసిన ఉన్నతాధికారికి అడ్డు ఎవరు అన్నట్లుగా పాలన సాగింది. సదరు అధికారి చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని ఓ అధికార పార్టీకి చెందిన కీలక నేత అండదండలు ఉండడంతో ఆ అధికారి ఏం చేసినా అడిగే నాథుడే లేకుండా పోయాడు.
కలెక్టర్ అనుమతి లేకుండా, నిబంధనలు పాటించకుండా 90 రోజుల పాలనలో 42 మంది వైద్యాధికారులు, వైద్యసిబ్బంది జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తించేలా వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో 60 మంది డిప్యుటేషన్‌లో కొనసాగుతున్నారు. అందులో మూడు నెలల్లో 42 మందికి డిప్యుటేషన్లు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
18 మంది యూపీహెచ్‌సీలకు..
డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న సిబ్బంది ఏకంగా కార్యాలయాన్ని శాసిస్తున్నారు. ఓ జూనియర్ వైద్యుడికి ప్రోగ్రాం అధికారులు పర్యవేక్షించే మాతాశిశుసంరక్షణ బాధ్యతలు అప్పగించారు. అలాగే, పంథినిలో విధులు నిర్వర్తించాల్సిన వైద్యాధికారికి హెల్త్ అసిస్టెంట్ విధులను డిప్యుటేషన్‌పై ఇచ్చారు. జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా కమలాపూర్, వంగర వంటి ప్రాంతాల్లో ఉన్న 18 మంది వైద్యసిబ్బందికి యూపీహెచ్‌సీలకు డిప్యుటేషన్లు కేటాయించారు. మౌఖిక ఆదేశాలతో వచ్చిన కొంతమంది సీనియర్ అసిస్టెంట్లు చాలా విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఒక్కో డిప్యుటేషన్‌కు ఒక్కో రేటు..
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో కొన్ని డిప్యుటేషన్లపై అవినీతి ఆరోపణలు రాగా, మరికొన్నింటిని తమ అనుయాయులకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక్కో డిప్యుటేషన్‌కు ఒక్కో రేటు తీసుకున్నట్లు సమాచారం. అవసరం లేకున్నా జిల్లా అధికారులు తమకున్న అధికారాలను దుర్వినియోగం చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయంలో డిప్యుటేషన్ సిబ్బంది దందా
డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న ఓ హెల్త్‌సూపర్‌వైజర్, సీనియర్ అసిస్టెంట్, హెచ్‌ఈఓ వంటి వైద్యసిబ్బంది పలు విషయాల్లో కీలకంగా వ్యవహరించి పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది సూపర్‌వైజర్లు ఏకంగా మూడు, నాలుగు సంవత్సరాల నుంచి కార్యాలయంలోనే డిప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ప్రభుత్వ సంకల్పానికి గండికొడుతున్నారు. కలెక్టర్ అనుమతి లేకుండా మౌఖిక ఆదేశాలతో అక్రమ డిప్యుటేషన్లు చేసిన అధికారిపై చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment