బైపాస్‌ను రద్దు చేయండి..
● మంత్రి పొంగులేటికి రైతుల వినతి
వరంగల్: బడాబాబుల మేలు కోసం ‘కుడా’ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన ఐఆర్‌ఆర్ బైపాస్ తమ జీవనాధారమైన పంట పొలాల నుంచి వెళ్తోందని, ఈ రోడ్డును రద్దు చేయాలని పైడిపల్లి, ఆరెపల్లి బైపాస్ రోడ్డు బాధిత రైతులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో జరిగిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు నేతలు, వ్యాపారులకు మేలు జరిపేందుకు తమ పంట పొలాల మీదుగా కొత్తపేట క్రాస్ వరకు అశాసీ్త్రయంగా రోడ్డును ప్రతిపాదించారని తెలిపారు. ఇప్పటికే జాతీయ రహదారి కింద తమ గ్రామ రైతుల భూములు పోయాయని, మళ్లీ బైపాస్, ఓఆర్‌ఆర్ కోసం తమ జీవనాధారమైన పంట పొలాలను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి పేదలు, రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సుంకరి ప్రశాంత్, బుద్దె గణేశ్, రావుల రామేందర్‌రెడ్డి, బుద్దె కృష్ణమూర్తి, బుద్దె సురేశ్, ఇట్నేని క్రాంతి, కమలాపురం జితేందర్, అచ్చ అమర్‌నాథ్ పాల్గొన్నారు.
పంచాయతీ నిధులు దారి మళ్లించిన ఎంపీడీఓ
● బొమ్మకల్లు జీపీ నిధులు రూ.1.10 లక్షలు పక్కదారి
తొర్రూరు/పెద్దవంగర: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామ పంచాయతీకి సంబంధించిన రూ.1.10 లక్షల ఈజీఎస్ నిధులను తొర్రూరు ఎంపీడీఓ దారి మళ్లించారు. ఆ నిధులు గ్రామ పంచాయతీ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉండగా తొర్రూరు ఎంపీడీఓ సీహెచ్. నర్సింగరావు తన సొంత ఖాతాకు మళ్లించుకున్నారు. ఈ నెల 3న ఎంపీడీఓ.. తొర్రూరు ఎస్‌బీఐ మేనేజర్‌ను కలిసి తన ఖాతాలోకి ఆ నిధులు ట్రాన్స్‌ఫర్ అయ్యేలా స్పెసిమెన్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయించుకున్నాడు. ఈ నెల 4న తన సొంత ఖాతాకు బొమ్మకల్లు జీపీ ఈజీఎస్ నిధులను ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి సంతకాలు లేకుండా, పెద్దవంగర ఎంపీడీఓ అనుమతి లేకుండా ఆ నిధులతో సంబంధం లేని తొర్రూరు ఎంపీడీఓ సదరు నిధులను దారి మళ్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై బొమ్మకల్లు పంచాయతీ కార్యదర్శి సురేందర్.. పెద్దవంగర ఎంపీడీఓ వేణుమాధవ్‌కు ఫిర్యాదు చేశారు. తొర్రూరు ఎంపీడీఓ నిధులను దారిమళ్లించడంపై పెద్దవంగర ఎంపీడీఓ కలెక్టర్, డీపీఓ, జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దుమారం రేగగా ఆ నిధులు బొమ్మకల్లు జీపీ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయడం కొసమెరుపు. ఈ ఘటనపై తొర్రూరు ఎంపీడీఓను వివరణ కోరగా.. సమగ్ర కుటుంబ సర్వే నిధులు రావాల్సి ఉందని, ఆ నేపథ్యంలోనే ఈ నిధులు తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment