బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్
● రూ.8.50 లక్షల విలువైన
బంగారు ఆభరణాలు స్వాధీనం
వరంగల్ క్రైం : ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న దంపతులను అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. వీరినుంచి సుమారు రూ.8.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సోమవారం హనుమకొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటారం గ్రామానికి చెందిన దంపతులు మద్దూరి సత్యనారాయణ, చెల్ల స్వప్న హనుమకొండ కుమార్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ కుల వృత్తి చేస్తుండగా, స్వప్న ఇంటి వద్దే ఉంటుంది. సత్యనారాయణకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులో చోరీలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా గతేడాది హనుమకొండ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిళ, వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరాణాలను స్వప్న చోరీ చేసి భర్తకు అందజేసింది. డిసెంబర్‌లో మరోసారి హనుమకొండ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న ఇద్దరు మహిళల మెడల్లో, సైడు బ్యాగులో బంగారు ఆభరణాలను చోరీ చేశారు. వరుస చోరీలపై అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో చోరీ చేసిన సొత్తును విక్రయించడానికి హనుమకొండ టైలర్స్ స్ట్రీట్ నుంచి వెళ్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఈ దంపతులపై అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. హనుమకొండ ఇన్‌స్పెక్టర్ సతీశ్, ఎస్సైలు అశోక్ కుమార్, కిశోర్, ఏఓ సల్మాన్‌పాషా, హెడ్ కానిస్టేబుళ్లు నారాయణ, రాహుఫ్, కానిస్టేబుళ్లు మహేశ్, అశోక్, వీరన్న, భాస్కర్‌ను ఏసీపీ అభినందించారు.
పుస్తక పఠనం అలవర్చుకోవాలి
● రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్
కాజీపేట అర్బన్ : విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ప్రతీ ఒక్కరు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎండీ రియాజ్ పేర్కొన్నారు. నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సెంట్రల్ లైబ్రరరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రేరియన్స్ అండ్ పబ్లిషర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా రియాజ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మెరుగైన సమాజ నిర్మాణంలో లైబ్రేరియన్లు, పబ్లిషర్లు ముఖ్య భూమిక పోషిస్తారని, నిట్‌లో సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, నిట్ లైబ్రరరీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆనంద్‌కిషోర్, లైబ్రేరియన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బ్యూటీపార్లర్‌లో ఉచిత శిక్షణ
హసన్‌పర్తి : హసన్‌పర్తిలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు బ్యూటీపార్లర్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ మేనేజర్ రవి పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు శిక్షణ పొందడానికి అర్హులన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు, తెలుపు రేషన్‌కార్డు కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. నెలరోజుల శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు 24వ తేదీలోపు సంస్కృతీ విహార్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 98493 07873 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment