రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా డీసీసీబీ
హన్మకొండ : రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) నంబర్ వన్‌గా ఉందని ఆ బ్యాంక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పేర్కొన్నారు. సోమవారం నక్కలగుట్టలోని ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ మహాజన సభ జరిగింది. ఈ సభలో చైర్మన్ రవీందర్ రావు మాట్లాడారు. పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.885 కోట్ల టర్నోవర్..ఇప్పుడు రూ.2,100 కోట్లకు చేరుకుందని వివరించారు. పంట రుణాలు రూ.372 కోట్ల నుంచి రూ.600 కోట్లకు, ఎల్‌టీ రుణాలు రూ.150 కోట్ల నుంచి రూ.342 కోట్లకు పెరిగాయని వెల్లడించారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి రూ.118 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. నాబార్డు సాయంతో 50 ప్రాథమిక సహకార సంఘాలను మల్టీపర్పస్ సర్వీస్ సెంటర్లుగా అభివృద్ధి చేశామన్నారు. రైతుల పిల్లలు విదేశీ విద్య అభ్యసించేందుకు రుణాలు అందించామని వివరించారు. ప్రతి మండలంలో డీసీసీబీ బ్రాంచీ ఏర్పాటుకు రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు పంపామన్నారు. రాష్ట్రంలోనే వరంగల్ డీసీసీబీ ఏ–గ్రేడ్ సర్టిఫికెట్ అందుకుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టి కరపత్రాలు ఆవిష్కరించారు.
నల్లవెల్లి కన్‌స్ట్రక్షన్స్‌కు వడ్డీతో
ఖర్చుల చెల్లింపు
డీసీసీబీలో ఖాళీగా ఉన్న భవన సముదాయాన్ని అద్దెకు ఇచ్చిన అంశంలో కొంత ఉపశమనం లభించింది. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేసినందుకు అయిన ఖర్చులను వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు డీసీసీబీ పాలక వర్గం ఏడుగురు డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీ వేసింది. నల్లవెల్లి కన్‌స్ట్రక్షన్స్‌కు రెండు వాయిదాలో మొత్తం రూ.3,23,93,099 డీసీసీబీ చెల్లించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానాన్ని సోమవారం వరంగల్ డీసీసీబీ మహాజన సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.
అధికారుల తీరుపై ఆగ్రహం..
జిల్లా సహకార అధికారుల తీరుపై డీసీసీబీ డైరెక్టర్లు, సంఘాల చైర్మన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో చెప్పారని తమపై కక్షసాధింపు, కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రైతులకు సహకరించి ధాన్యం తరలిస్తే రవాణా ఖర్చులు ఎలా చూపెడతారని జిల్లా సహకార అధికారి తమపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నారని డీసీసీబీ డైరెక్టర్, తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ కక్కిరాల హరిప్రసాద్ మండిపడ్డారు. మరో డైరెక్టర్ చెట్టుపల్లి మురళీధర్ తమ సొసైటీపై కుట్రలకు పాల్పడుతున్నారని, నాచినపల్లి సొసైటీపై చర్యలు తీసుకుంటే కోర్టుకు వెళ్లామని వరంగల్ డీసీఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి ఇతర సంఘాల చైర్మన్లు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ సీఈఓ ఎండీ వజీర్ సుల్తాన్, జిల్లా సహకార అధికారులు, డీసీసీబీ డైరెక్టర్లు, సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.
రూ.2,100 కోట్ల టర్నోవర్‌తో అగ్రస్థానం
డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
Comments
Please login to add a commentAdd a comment