వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ పరిధిలో సంక్షేమ పథకాల అర్హుల ఎంపికకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈమేరకు వార్డు సభల్లోని ప్రాంతాలను వెల్లడిస్తూ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలకు అర్హుల గుర్తింపు జరగనుంది. ఈనెల 24 వరకు పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి తుది జాబితాను ఖరారు చేశాక.. ఆజాబితాలో అర్హులను కమిటీల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జబితాను స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రికి సమర్పిస్తారు. తుది జబితాను ఖరారు చేసి అర్హుల వివరాలను ప్రకటిస్తారు.
అభ్యంతరాల స్వీకరణ
పథకాలపై ఇప్పటికే ఇంటింటా సర్వే పూర్తయినందున వార్డు సభ ఎదుట ప్రదర్శిస్తారు. ఏమైనా అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. వాటిని పరిష్కరించిన తర్వాత తుది జాబితా ఖరారు కానుంది. అనర్హులను ఎంపిక చేస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై వేటు పడుతుందని ఇప్పటికే ఉన్నతధికారులు హెచ్చరించారు. కాశిబుగ్గ, కాజీపేట డిప్యూటీ కమిషనర్లు వార్డు సభలను పర్యవేక్షించనున్నారు.
ప్రభుత్వ పథకాలపై వార్డు సభలు
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment