మాషుక్ రబ్బానీ ఉర్సు ప్రారంభం..
● భక్తిశ్రద్ధలతో గంధం, చాదర్ ఊరేగింపు
● పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
న్యూశాయంపేట : వరంగల్ ఉర్సు కరీమాబాద్‌లోని హజ్రత్ సయ్యద్‌షా జలాలుద్దీన్ జామలుల్ బహార్ మాషుఖ్ ఏ రబ్బానీ(ర.ఆ) 469వ ఉర్సు ఉత్సవాలు బుధవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గా పీఠాధిపతులు నవీద్‌బాబా, ఉబేద్‌బాబా ఇంటి నుంచి అర్ధరాత్రి గంధం, చాదర్‌ను భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్తుల సమక్షంలో తెల్ల వారుజాము వరకు ఊరేగించి మాషూఖ్‌రబ్బానీ దర్గా వరకు తీసుకెళ్లి సమర్పించారు. మూడు రోజులు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు బుధవారం గంధం ఊరేగింపు, రెండో రోజు ఉర్సు, మూడో రోజు బాదావ ఉంటుంది. అంతకు ముందు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, బల్ది యా కమిషనర్ అశ్వినీతానాజీ వాఖడే దర్గా పీఠాధిపతుల ఇంటికి చేరుకున్నారు. అనంతరం మాషూఖ్‌రబ్బానీ దర్గాను సందర్శించి మాషుఖ్‌రబ్బానీ(ర.ఆ) సమాధిపై గిలాఫ్, పూలు, సమర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాగా, మంత్రి సురేఖ.. భక్తులతో ముచ్చటించారు. ఏర్పాట్లపై ఆరాతీశారు.
విద్యుత్‌దీపాలతో ధగధగ మెరిసిన దర్గా..
ఉర్సు ఉత్సవాల్లో భాగంగా మాషుఖ్ దర్గా ప్రాంగణం విద్యుత్ దీపాలతో ధగధగ మెరిసింది. వేలాది మంది భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. ఉత్సవాల్లో భాగంగా దర్గా, కరీమాబాద్ పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, కంగన్‌హాళ్లు, పిల్లల ఆటవస్తువుల స్టాళ్లు వెలిశాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కార్పొరేటర్లు రవి, మహ్మద్ ఫుర్ఖాన్, పల్లం పద్మరవి, నాయకులు నవీన్‌రాజ్, ఆయూబ్, ఎం.ఏ.జబ్బార్, ఎం.డి.వసీం, చాంద్‌పాషా, అమ్జద్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment