చిన్నారుల సమగ్ర వికాసానికి గ్రంథాలయాలు అవసరం
సాక్షి, సిటీబ్యూరో: చిన్నారుల్లో సృజనాత్మకతను, జ్ఞానాన్ని పెంచేందుకు గ్రంథాలయాలు ఎంతో దోహదం చేస్తాయని ‘బాలచెలిమి’ పత్రిక సంపాదకులు, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఆఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్రగ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు ఆటలు, పఠనానికి దూరమవుతున్నారని, వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు పిల్లల గ్రంథాలయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పౌరసమాజం ముందుకు రావాలని కోరారు. గ్రంథాలయాలు కేవలం చదువుకోవాడినికే కాదని, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి అవసరమని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ, కేంద్ర గ్రంథాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ అతికా అహ్మద్, మహిళా విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ రోహిణి, రచయిత్రి కన్నెగంటి అనసూయ, కప్పర కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment