వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారినపడ్డారు. 74 ఏళ్ల ట్రంప్ వయసు, అధిక బరువు వంటి కారణాలతో కోవిడ్-19 రోగుల్లో అధిక ముప్పున్న కేటగిరీగానే పరిగణించాలి. అధ్యక్షుడు ట్రంప్ వైరస్‌ను ఎదుర్కొన్న తీరుకు ఈ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆయన భార్య మెలానియాకు కరోనా వైరస్ సోకడం అధ్యక్ష ఎన్నికలపై చర్చ ఉత్కంఠభరితంగా మారింది. ట్రంప్ వయసు, బరువు, జెండర్ పరంగా చూస్తే తన కంటే 24 ఏళ్లు తక్కువ వయసు కలిగిన భార్య మెలానియా (50)తో పోల్చితే ఆయనలో వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ వయసున్న వారిలోనూ చాలా మందికి స్వల్ప లక్షణాలే కనిపించినా మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్న విషయం మరువరాదని అప్రమత్తం చేస్తున్నారు. కోవిడ్-19 ఎవరిపైనైనా విరుచుకుపడుతుందని, అయితే వృద్ధులు పలు వ్యాధులతో బాధపడేవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీకి చెందిన శ్వాసకోశ వ్యాధుల నిపుణులు బ్రైన్ ఒలీవర్ పేర్కొన్నారు. అయితే తమకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, తాము మెరుగ్గా ఉన్నామని మెలానియా ట్రంప్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో వారిద్దరూ వైట్‌హౌస్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నారని అధ్యక్షుడి వైద్యులు తెలిపారు. కాగా వైరస్ బారినపడిన 65 నుంచి 74 ఏళ్ల వయస్కులు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఐదు రెట్లు అధికం కాగా, 18-29 సంవత్సరాల వారితో పోలిస్తే వైరస్‌తో మరణించే అవకాశాలు 90 రెట్లు అధికమని వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) అంచనా వేసింది.
ఇక అమెరికాలో కరోనా మృతుల్లో 54 శాతం మంది పురుషులే కావడం గమనార్హం. ట్రంప్ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30.5 కాగా ఇది అధిక బరువును సూచించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ట్రంప్ ఐసోలేషన్ కావడంతో పాటు నీరు ఎక్కువగా తాగడంతో పాటు విశ్రాంతి తీసుకోవాలని లక్షణాలను గమనిస్తుండాలని బ్రిటన్‌లోని లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన థామస్ వింగ్‌ఫీల్డ్ సూచించారు. వైరస్ సోకిన ఐదు నుంచి ఏడు రోజులకు లక్షణాలు బయటపడతాయని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. ఇక అమెరికాలో ఇప్పటివరకూ 73 లక్షల కోవిడ్-19 కేసులు నమోదవగా 2,08,000 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. చదవండి : త్వరగా కోలుకోండి మిత్రమా : మోదీ
Comments
Please login to add a commentAdd a comment