ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల ధాటికి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా కకావికలవుతోంది. ముఖ్యంగా అగ్ర నాయకత్వమంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్, తర్వాత టాప్ కమాండర్ ఫౌద్ షుక్ర్. ఇప్పుడు తాజాగా ఏకంగా సంస్థ అధినేత నస్రల్లా. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అగ్ర నేతలందరినీ రోజుల వ్యవధిలోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్.
శుక్రవారం నాటి దాడుల్లో నస్రల్లాతో పాటు కనీసం మరో ఇద్దరు అగ్ర నేతలు కూడా మరణించారు. దాంతో హెజ్‌బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఈ మేరకు కథనం కూడా వెలువడింది.
హషీం ప్రస్తుతం హెజ్‌బొల్లా రాజకీయ వ్యవహారాల చీఫ్‌గా ఉన్నాడు. శుక్రవారం నాటి హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ లక్షిత దాడుల్లో అతను కూడా మరణించినట్టు తొలుత వార్తలొచి్చనా అదేమీ లేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు తేల్చాయి. హషీం ప్రస్తుతం హెజ్‌బొల్లా రాజకీయ వ్యవహారాలు చూడటమే గాక సంస్థ జిహాద్ కౌన్సిల్‌లో కీలక సభ్యుడు కూడా. 2017 లోనే అమెరికా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పైగా హెజ్‌బొల్లాకు కొమ్ముకాసే ఇరాన్‌తో అతనికి అతి సన్నిహిత సంబంధాలున్నాయి.
2020లో అమెరికా మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ కూతురు జైనబ్‌కు హషీం మామ అవుతాడు. నస్రల్లా మాదిరిగానే ఇతను కూడా మతాధికారే. తలపాగతో అచ్చం నస్రల్లాను తలపిస్తాడు. 1964లో దక్షిణ లెబనాన్‌లో పుట్టాడు. 1990ల్లో ఇరాన్ లో ఉన్నత చదువులు చదువుతుండగానే హెజ్‌బొల్లా అతన్ని వెనక్కు పిలిపించింది. తర్వాత ఏడాదికే నస్రల్లా హెజ్‌బొల్లా్ల చీఫ్ అయ్యాడు. రెండేళ్లకే హషీం సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సార థి అయ్యాడు. నాటినుంచే నస్రల్లా వారసునిగానూ గుర్తింపు పొందుతూ వస్తున్నాడు. విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు తదితరాలు చూసుకుంటున్నాడు. మారిన పరిస్థితుల్లో హెజ్‌బొల్లాకు సారథి కావాలంటే సంస్థ ఇతర అగ్ర నేతలతో పాటు ఇరాన్ మద్దతునూ హషీం కూడగట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment