వాటిని అడ్డుకుంటాం.. రష్యాకు జోబైడెన్‌ వార్నింగ్‌ | Joe Biden Warning To Russia If They Invades Russia | Sakshi
Sakshi News home page

వాటిని అడ్డుకుంటాం.. రష్యాకు జోబైడెన్‌ వార్నింగ్‌

Published Wed, Feb 9 2022 4:11 AM | Last Updated on Wed, Feb 9 2022 10:06 AM

Joe Biden Warning To Russia If They Invades Russia - Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే రష్యా, జర్మనీ మధ్య గ్యాస్‌ సరఫరాకు ఉద్దేశించిన నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ను అడ్డుకుంటామని యూఎస్‌ అధ్యక్షుడు జోబైడెన్‌ హెచ్చరించారు. జర్మనీ నూతన చాన్స్‌లర్‌తో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా మరొక్క అడుగు ముందుకేసినా నార్డ్‌ స్ట్రీమ్‌ 2 ఉండదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నాటో కూటమి ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉందని బైడెన్‌ చెప్పారు. ఈ పైప్‌లైన్‌ అడ్డుకుంటే రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది, కానీ అదే సమయంలో జర్మనీకి కూడా ఇబ్బందులు తప్పవు.

ఇప్పటికే ఈ పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తయింది, కానీ ఇంకా కార్యకలాపాలు మొదలుపెట్టలేదు. ఈనేపథ్యంలో ఉక్రెయిన్‌ విషయం విషమించకుండా ఉండేందుకు జర్మనీ, ఫ్రాన్స్‌ యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా జర్మనీ చాన్స్‌లర్‌ షుల్జ్‌ అమెరికా ప్రెసిడెంట్‌తో వాషింగ్టన్‌లో సమావేశమవగా, అదే సమయంలో రష్యా అధ్యక్షుడితో ఫ్రాన్స్‌ అధిపతి మాక్రాన్‌ మాస్కోలో ఐదుగంటల పాటు చర్చలు జరిపారు. జోబైడెన్‌ హెచ్చరికలపై స్పందిస్తూ, ఆక్రమణలు యూఎస్, దాని మిత్రపక్షాలకు అలవాటని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎద్దేవా చేశారు. పైప్‌లైన్‌కు అడ్డంపడకుండా ఉండేందుకు జర్మనీ నేత షుల్జ్‌ యత్నిస్తున్నారు. రష్యాపై ఆంక్షల విషయంలో కొంత పట్టువిడుపులుండాలని, అదే సమయంలో జరగబోయే పరిణామాలపై రష్యా ఆలోచించుకోవాలని షుల్జ్‌ సూచించారు.  

నిర్లక్ష్య నాటో 
తమ డిమాండ్లను నాటో, యూఎస్‌ నిర్లక్ష్యం చేశాయని మాక్రాన్‌తో చర్చల సందర్బంగా పుతిన్‌ అభిప్రాయపడ్డారు. నాటోలో మాజీ సోవియట్‌ యూనియన్‌ దేశాలను చేర్చుకోవద్దని రష్యా డిమాండ్‌ చేస్తోంది. నాటో విస్తరణకు తాము వ్యతిరేకమని, నాటో తమకు ప్రమాదకారని పుతిన్‌ వ్యాఖ్యానించారు. తామెలాంటి ఆక్రమణకు ముందుకువెళ్లడం లేదని, నాటో దళాలే తమ మీదకు వస్తున్నాయని చెప్పారు. నాటో తీరును ఇరాక్, లిబియా, అఫ్గాన్‌ ప్రజలనడిగితే బాగా చెబుతారని ఎద్దేవా చేశారు. నాటోలో ఉక్రెయిన్‌ చేరి క్రిమియాను ఆక్రమించాలనుకుంటే భారీ యుద్ధం తప్పదని హెచ్చరించారు. అదే జరిగితే యూరప్‌ దేశాలన్నీ యుద్ధంబారిన పడతాయన్నారు. ఇందులో ఎవరికీ గెలుపుండదని వ్యాఖ్యానించారు. పుతిన్‌తో లోతైన చర్చలు జరిగాయని మాక్రాన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌లో దౌత్య సిబ్బంది మినహా ఇతర అమెరికన్లు స్వదేశానికి రావడం మంచిదని బైడెన్‌ హెచ్చరించారు. అయితే తామెలాంటి ఆక్రమణకు దిగమని పుతిన్‌ మరోసారి భరోసా ఇచ్చారు. మాక్రాన్‌ ప్రతిపాదనల్లో కొన్ని భవిష్యత్‌ ఉద్రిక్తతల సడలింపునకు ఉపయోగపడతాయని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement