మహిళా సిబ్బందికి వెసులుబాటు | Sakshi
Sakshi News home page

మహిళా సిబ్బందికి వెసులుబాటు

Published Mon, May 6 2024 7:40 AM

మహిళా సిబ్బందికి వెసులుబాటు

● ఈసారి స్థానిక సెగ్మెంట్లలో విధులు ● ఉద్యోగినులకు తప్పనున్న తిప్పలు

కోరుట్ల: ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో మహిళా సిబ్బందికి జంబ్లింగ్‌ తిప్పలు తప్పాయి. తమ సొంత నియోజకవర్గాల్లో ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహిస్తే కొన్నిసార్లు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ప్రతిసారి ఎన్నికల్లో జంబ్లింగ్‌ పద్ధతిన ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల కేటాయింపు ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో పోలింగ్‌ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులు సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో మహిళా ఉద్యోగులు నానా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఎండలు ముదిరిన పరిస్థితుల్లో మహిళా సిబ్బందికి జంబ్లింగ్‌ పద్ధతిని తొలగించి స్థానిక నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తించే అవకాశం కల్పించారు.

తప్పిన తిప్పలు

ప్రతిసారి ఎన్నికల్లో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురికి చెందిన సిబ్బందిని జంబ్లింగ్‌ పద్ధతిన తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో విధులు కేటాయించేవారు. దీంతో కోరుట్ల సెగ్మెంట్‌ చివరలో ఉన్న ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాల ఉద్యోగులు సుమారు 80–100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురి, జగిత్యాల మండలాల్లోని గ్రామాల్లో పోలింగ్‌ విధులు నిర్వహించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లి ఎలాంటి వసతులు లేకున్నా విధులు నిర్వహించేందుకు మహిళా సిబ్బంది నానా తంటాలు పడేవారు. కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం సరిగా లేక నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఈసారి ఎండలు మండిపోతుండటంతో మళ్లీ ఎప్పటిలాగే ఇతర సెగ్మెంట్లలో విధులు నిర్వహించాల్సి వస్తే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఆందోళన చెందిన మహిళా సిబ్బందికి ఎన్నికల అధికారుల నిర్ణయంతో ఊరట దక్కింది.

దక్కిన ఊరట

ఈసారి ఎన్నికల కోసం వారంక్రితం ఎన్నికల సిబ్బందికి సెగ్మెంట్ల వారీగా విధులు కేటాయించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో పీవో, ఏపీవో, ఇద్దరు పోలింగ్‌ క్లర్క్‌తోపాటు రిజర్వ్‌ సిబ్బంది కింద జగిత్యాల సెగ్మెంట్‌లో 1,150 మంది పోలింగ్‌ సిబ్బంది, కోరుట్ల సెగ్మెంట్‌లో 1,290 మంది ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయించారు. వీరిలో జగిత్యాల సెగ్మెంట్‌లో సుమారు 450 మహిళా సిబ్బంది, కోరుట్లలో మరో 380మహిళా సిబ్బంది ఉన్నారు. వీరికి సెగ్మెంట్లను మార్చుతూ విధులు కేటాయించే జంబ్లింగ్‌ పద్ధతికి మినహాయింపును ఇచ్చి స్థానిక సెగ్మెంట్లల్లో విధుల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో చాలామంది మహిళా సిబ్బందికి వెసులుబాటు దక్కింది. ఈ విషయాన్ని కోరుట్ల తహసీల్దార్‌ కిషన్‌ ధ్రువీకరించారు. పోలింగ్‌ శిక్షణ కార్యక్రమం ఇప్పటికే రెండు విడతలు ముగియగా.. త్వరలో గ్రామాల్లో పోలింగ్‌ స్టేషన్లవారీగా విధుల కేటాయంపు ఉంటుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement