ఇవేం బది‘లీలలు’
● దేవాదాయశాఖలో కొనసాగుతున్న డిప్యూటేషన్ల పర్వం ● రాజన్నకన్నా నర్సన్న మీదనే దేవాదాయశాఖ భక్తి ● వేములవాడ నుంచి యాదగిరిగుట్టకు మరో ఏఈఓ డిప్యూటేషన్ ● పదోన్నతులు పొందిన వారికి తప్పని ఎదురుచూపులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
దేవాదాయశాఖలో ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక బదిలీలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధానమైన వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, కొండగట్టు, కొమురవెల్లి, బాసర ఆలయాలను యూనిట్‌గా గత ఆగస్టులో దేవాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల తీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణకాశీగా పేరొంది, అత్యధిక భక్తుల తాకిడి, ఆదాయం కలిగి ఉన్న వేములవాడ రాజన్న ఆలయం కన్నా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీదనే రాష్ట్రస్థాయి అధికారులకు అధిక ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, రాజన్నను విస్మరిస్తున్నారన్న ప్రచారం దేవాదాయశాఖలో మొదలైంది. ఎందుకంటే.. ఈ బదిలీలు జరిగిన 15రోజుల్లోనే డిప్యూటేషన్ పర్వానికి తెరతీసిన రాష్ట్రస్థాయి అధికారులు ఒక్కొక్కరిగా వేములవాడ నుంచి యాదగిరిగుట్టకు మాత్రమే డిప్యూటేషన్ ఇస్తున్నారు. ఎములాడ రాజన్న అంటే వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఉద్యోగుల ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉన్నతాధికారుల తీరు ఉంది. ఆలయంలో సదుపాయాల పెంపు సంగతి అంటుంచితే.. ఇక్కడ నుంచి ఉద్యోగులు తరలివెళ్తున్న తీరుపై ఎములాడ రాజన్న ఆలయ సిబ్బంది మండిపడుతున్నారు.
రాజన్న అంటే చిన్నచూపేలా?
రాష్ట్రస్థాయి అధికారులకు ఇతర దేవాలయాల కన్నా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిపైనే ఆసక్తి అధికంగా ఉందని దేవాదాయశాఖలో ప్రచారం జరుగుతోంది. బదిలీల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయానికి యాదగిరిగుట్ట నుంచి బదిలీపై వచ్చిన ఉద్యోగులను ఒక్కొక్కరిగా యాదగిరిగుట్టకు డిప్యూటేషన్ వేస్తూ ఉండడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఆగస్టులోనే ఇద్దరు పర్యవేక్షకులకు వర్క్ ఆర్డర్ పేరిట బదిలీ చేశారు. వేములవాడలో విధులు నిర్వహిస్తున్న రాజన్‌బాబును యాదగిరిగుట్టకు, యాదగిరిగుట్టలో విధులు నిర్వహిస్తున్న గోలి శ్రీనివాసులును వేములవాడకు చెందిన ఓ నాయకుడి వద్ద పీఏగా డిప్యూటేషన్‌కు అనుమతిస్తూ.. అప్పటి కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడలో పనిచేస్తున్న పర్యవేక్షకురాలు శ్రీలతను సెప్టెంబర్ 23న యాదగిరిగుట్టకు డిప్యుటేషన్ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ ఏఈఓ రమేశ్‌బాబును యాదగిరిగుట్టకు డిప్యూటేషన్‌పై పంపిన ఆదేశాలు రాజన్న ఆలయ కార్యాలయానికి బుధవారం చేరాయి. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న హనుమంతరావు ఇటీవలే కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమంతు అనే ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించినప్పటికీ సాంకేతిక కారణాలతో ఆయనకు బాధ్యతలు అప్పగించలేదన్న ప్రచారం నడుస్తోంది. తాజాగా మరో ఐఏఎస్ అధికారి శ్రీధర్‌ను నియమించగా బాధ్యతలు చేపట్టక ముందే డిప్యూటేషన్ ఉత్తర్వులు వెలువడడం దేవాదాయశాఖ ఉద్యోగవర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. బదిలీలను అత్యంత పకడ్బందీగా నిర్వహించామని చెబుతున్న ఆ శాఖ ఉన్నతాధికారులే డిప్యూటేషన్ల పర్వంలో అనుసరిస్తున్న తీరు దేవాదాశాఖ ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పదోన్నతి పొందినా తప్పని ఎదురుచూపులు
దేవాదాయశాఖలో ఇటీవలే కొందరికి పదోన్నతులు లభించాయి. వేములవాడ రాజన్న ఆలయంలో పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న డీఈవో, ఏఈవో, ఇద్దరు సూపరింటెండెంట్లు, ఇద్దరు పర్యవేక్షకులు పదోన్నతి పొందారు. వీరంతా ఇప్పటికే పాత ఉద్యోగాన్నే కొనసాగిస్తున్నా.. ఉన్నతాధికారులకు పట్టింపు లేకుండా పోయింది. వాస్తవానికి పదోన్నతితోపాటు బదిలీ చేయడం ఆనవాయితీ. అదే సమయంలో మాతృసంస్థకు బదిలీ చేసి పదోన్నతిని అమలు పరచాలని ఎదురుచూస్తున్నారు. దీనిపై స్పందించిన ఆయా దేవాలయాల ఉన్నతాధికారులు కూడా పదోన్నతి పొందిన వారిని బదిలీ చేసి, మాతృసంస్థలకు పంపే విషయంలో ఉద్యోగులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. వాటిని మాత్రం అలానే పెండింగ్‌లో ఉంచి డిప్యూటేషన్లను ప్రోత్సహిస్తున్న తీరు ఉద్యోగవర్గాల్లో అసహనానికి దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment