సౌకర్యాలున్నా.. రోడ్డుపైనే అమ్మకాలు
మార్కెట్‌లోనే విక్రయించాలి
సకల సౌకర్యాలు ఉన్న విశాలమైన మార్కెట్‌ను ఖాళీగా వదిలేసి రోడ్డుపై కూరగాయలు, పండ్లు విక్రయిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అత్యవసర సమయాల్లో మరింత ఇబ్బంది ఏర్పడుతుంది. బల్దియా అధికారులు చొరవ తీసుకుని మార్కెట్ లోపలే విక్రయాలు జరిపేలా చూడాలి.
– సాయిసాకేత్, విద్యానగర్
మార్కెట్‌లో విక్రయించేలా చూస్తాం
మున్సిపల్ మార్కెట్ బయట రోడ్డుపై అమ్మకాలు సాగుతున్నది వాస్తవమే. మార్కెట్ లోపలే విక్రయాలు సాగేలా చర్యలు తీసుకుంటాం.
– చిరంజీవి, బల్దియా కమిషనర్ జగిత్యాల
జగిత్యాలటౌన్: జగిత్యాల మున్సిపల్ మార్కెట్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టవర్ ప్రాంతంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లో రద్దీని తగ్గించడంతోపాటు మోచీబజార్, టవర్ సర్కిల్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మున్సిపల్ మార్కెట్ రైతులు లేక వెలవెలబోతోంది. సకల సౌకర్యాలతో నిర్మించిన మార్కెట్‌లోని షెడ్లలో విక్రయించాల్సి ఉన్నా.. రోడ్డుపైనే కానిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం వెళ్లలేని దుస్థితి నెలకొందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మటన్, చికెన్, చేపలు, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు అన్నీ ఒకేచోట విక్రయించేలా సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ నిరుపయోగంగా మారి మున్సిపల్, ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్‌కు అడ్డాగా మారింది. మార్కెట్‌లోని షెడ్లన్నీ ఖాళీగా ఉండటంతో పోకిరీలకు అడ్డాగా మారింది. కూరగాయల విక్రయాలు సాగకపోవడంతో షెడ్లలో పిచ్చి మొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరుతోంది. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారులు చొరవ తీసుకుని రోడ్డుపై కూరగాయల విక్రయాలను నిలిపివేసి ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో..
పెరుగుతున్న జనాభా పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం దాదాపు రూ.50లక్షలతో మటన్, చికెన్, చేపలు, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు విక్రయించేలా శాశ్వత షెడ్లు నిర్మించింది. తాగునీటి వసతి, మూత్రశాలలు సహా సకల సౌకర్యాలతో రైతుబజార్ నిర్మాణం చేశారు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతో అన్ని వసతులు ఉన్న రైతుబజార్ మూతపడింది.
గతంలోనూ ఇదే పరిస్థితి..
అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా గతంలో ఓసారి రైతుబజార్ మూతపడింది. ఆ తర్వాత కొంతకాలం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఫంక్షన్‌హాల్‌గా మారింది. స్థానిక ప్రజల అవసరాలు తీర్చే లక్ష్యంతో గత పాలకవర్గం మరో రూ.50లక్షలు వెచ్చించి మరమ్మతు చేసి మున్సిపల్ మార్కెట్‌గా తిరిగి ప్రారంభించింది.
కరువైన నియంత్రణ
మున్సిపల్ మార్కెట్ విక్రయాలపై అధికారుల నియంత్రణ కరువవడంతో అమ్మకందారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మార్కెట్ లోపలంతా ఖాళీగా ఉంటే రోడ్డుపై విక్రయాలెందుకని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి మున్సిపల్ మార్కెట్ ముందు రోడ్డుపై కూరగాయలు, పండ్ల విక్రయాలు నిలిపివేసి మార్కెట్ లోపల విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిరుపయోగంగా మున్సిపల్ మార్కెట్
లక్షలాది ప్రజాధనం వృథా
ట్రాఫిక్ సమస్యతో స్థానికులు, వాహనదారుల తిప్పలు
Comments
Please login to add a commentAdd a comment