లక్ష్యం.. వంద శాతం
● పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● ఉదయం, సాయంత్రం నిర్వహణ ● విధిగా హాజరవుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
జిల్లాలో..
మల్లాపూర్(కోరుట్ల): పదో తరగతిలో ప్రతిభ కనబర్చితే విద్యార్థుల భవిష్యత్ బంగారు బాట పడుతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఉన్నతాధికారులు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాఠశాల సమయం కంటే గంట ముందుగా విధులకు హాజరవుతున్నారు. వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు.
3 నుంచి ప్రత్యేక తరగతులు
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 3 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. రోజూ సాయంత్రం గంట పాటు విద్యార్థులకు ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు ముఖ్యమైన అంశాలను చదివించి, వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి పదో తరగతి పరీక్ష విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులకు 20 మార్కులు ఇంటర్నల్, 80 మార్కులకు రాత పరీక్షలు ఉంటాయి. సీసీఈ ప్రశ్నవళి విధానంతో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున వీటిని దృష్టిలో ఉంచుకొని ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
ముందస్తు అవగాహన
ఎస్సెస్సీ పరీక్షల కోసం విద్యార్థులకు పాఠశాలల్లో ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా ఉదయం, సాయంత్రం అదనంగా గంట పాటు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఎలా చదవాలి, ఎక్కువ మార్కులు సాధించడంపై అవగాహన కల్పిస్తున్నారు. రోజుకో పరీక్ష నిర్వహించి బిట్స్ ఎలా రాయాలో ప్రిపేర్ చేయిస్తున్నారు.
జెడ్పీ పాఠశాలలు 187
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 13
మోడల్ స్కూళ్లు 13
కేజీబీవీలు 14
ప్రత్యేక తరగతులు..
పదో తరగతిలో ఉత్తమ ఫలి తాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నాం. ఈసారి వందశాతం ఫలితాలు సాధిస్తాం.
– శ్రీనివాస్,
జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం, చిట్టాపూర్
ఉత్తమ ఫలితాల సాధనకు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. వంద శాతం లక్ష్యాన్ని చేరుతామని ఆశిస్తున్నాం.
– జగన్మోహన్‌రెడ్డి, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment