యథేచ్ఛగా నీటి దోపిడీ
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. అందులో హరితహారం కింద నాటిన మొక్కల కోసమని గతంలో మున్సిపాలిటీ తరఫున బావి తవ్వించారు. దానికి మోటారు కూడా ఏర్పాటు చేశారు. ఆ నీటిని మున్సిపల్ ప్రజల కోసం వినియోగించాల్సి ఉండగా.. ప్రైవేటు వ్యక్తులు దోచుకెళ్తున్నారు. ట్యాంకర్‌కు రూ.వెయ్యి నుంచి రూ.1500 చొప్పున ఇదే జిల్లాకేంద్రంలో విక్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు నీటిని తీసుకెళ్లాలంటే బల్దియాకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. కానీ.. ఇక్కడ ట్రాక్టర్ యజమానులు మాత్రం ఎలాంటి రుసుం చెల్లించకుండానే యథేచ్ఛగా నీటిని తరలించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన మున్సిపల్ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. నీటి ఎద్దడి ఉన్న సమయంలో ఈ బావి నీటిని ప్రజలకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ లోపే కొందరు ట్రాక్టర్ యజమానులు నీటిని తోడేసుకుంటున్నారు. మరోవైపు నీటి ఎద్దడి వస్తే తమ పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఎద్దడి సమయంలోనూ అంతే..
నీటి ఎద్దడి వచ్చిన సమయంలో ట్యాంకర్ యజమానుల వసూలుకు అడ్డూఅదుపు ఉండడం లేదు. ట్యాంకర్‌కు ఇష్టానుసారంగా రేట్లు పెంచి నీటిని అమ్ముకుంటున్నారు. వారం క్రితం జిల్లా కేంద్రంలో నీటి ఎద్దడి ఏర్పడింది. మిషన్ భగీరథ నీరు ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి నేరుగా ఫిల్టర్‌బెడ్‌కు వస్తుంది. ఆ వ్యవస్థ తరచూ మరమ్మతుకు లోనవుతోంది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా మిషన్ భగీరథనీరు తక్కువగా వస్తోంది. ఇలా నీటి ఎద్దడి ఉన్న సమయంలో ఫిల్టర్‌బెడ్ సమీపంలో ఉన్న ధర్మసముద్రం చెరువును ఎస్సారెస్పీ నీటితో నింపి పట్టణ ప్రజలకు సరఫరా చేస్తుంటారు. కొన్నిరోజుల క్రితం ధర్మసముద్రంలో నీరు అడుగంటడం, ఎస్సారెస్పీ నీరు రాకపోవడంతో హౌసింగ్‌బోర్డు, ధరూర్ క్యాంప్, కృష్ణానగర్, కొత్తబస్టాండ్ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోగా.. మరికొందరు వాటర్‌ప్లాంట్ల నుంచి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ట్యాంకర్ యజమానులు నీటి దందాకు తెరలేపారు. హౌసింగ్‌బోర్డులో ఉన్న మున్సిపల్ బావి నుంచి ట్యాంకర్‌లో నింపుకొని విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి మున్సిపల్ నీటిని వాడుకుంటే బల్దియా కు ట్యాంకర్‌కు కొంత చొప్పున డబ్బులు చెల్లించా లి. కానీ.. ట్యాంకర్ యజమానులు మాత్రం ఎలాంటి డబ్బులు చెల్లించుకుండానే యథేచ్ఛగా తరలించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ పనులకూ ఇదే నీరు..
మున్సిపాలిటీ తరఫున జిల్లాకేంద్రంలో అక్కడక్కడ చేపడుతున్న సీసీరోడ్లు, డ్రైనేజీ పనులకు అవసరమైన నీటిని ఈ బావి నుంచే తెప్పించుకుంటున్నా రు. కాంట్రాక్టర్లు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకై ్క ఆ నీటిని తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నా యి. కాంట్రాక్టర్లకు మున్సిపల్‌కు చెందిన బావి నుంచి ఉచితంగా నీరు తెప్పించుకోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు స్పందించి బావి నీరు అక్రమంగా తరలించకుండా మున్సిపల్ తరఫున ఓ వ్యక్తిని నియమించాలని, నీటిని దొంగిలించకుండా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్‌లో ఆ వార్డు కౌన్సిలర్ శ్రీలత బావి నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని, మున్సిపల్ ప్రజలకే వినియోగించుకునేలా చూడాలని ఆమె సూచించారు.
ప్రైవేటు ట్యాంకర్లలో తరలుతున్న మున్సిపల్ నీరు
నీటి దందాకు తెరలేపిన ట్యాంకర్ యజమానులు
రూ.వెయ్యి నుంచి రూ.1500కు విక్రయం
నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు రూ.లక్షల్లో దోపిడీ
మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి
హరితహారం కోసం..
వాస్తవానికి ఈ బావిని హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు అందించేందుకు తవ్వించారు. బావి నుంచి నేరుగా వచ్చే నీరు అయితే మొక్కలు చనిపోవని, ఫిల్టర్ వాటర్ అయితే మొక్కలు చనిపోతాయనే ఉద్దేశంతో ఈ బావిని తవ్వించారు. కానీ.. అధికారులు మాత్రం హరితహారం కార్యక్రమానికి ఈ నీటిని వినియోగించుకోకపోవడం గమనార్హం. హౌసింగ్‌బోర్డులో ఏర్పాటు చేసిన ఉద్యానవనం కోసమైనా ఉపయోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల వారు దొంగిలించకుండా చూడాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
నీరు అక్రమంగా తరలుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ బావిని మున్సిపాలిటీ ప్రజలకే ఉపయోగపడేలా చూస్తాం. బావి నుంచి నీటిని ఎవరూ తీసుకెళ్లకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తాం. నీటి ఎద్దడి ఏర్పడిప్పుడు ప్రజలకు ఉచితంగా అందించేలా చర్యలు చేపడతాం.
– చిరంజీవి, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment