చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించాలి
జగిత్యాల: చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలో తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సఖీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. మహిళలు పనిచేసే చోట కలిగే ఇ బ్బందులు, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి నరేశ్, తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్ శ్రీనివాస్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న 120 సెల్‌ఫోన్ల అప్పగింత
జగిత్యాలక్రైం: సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా సీఈఐఆర్ అప్లికేషన్‌లో నమోదు చేసుకుంటే వాటిని గుర్తించవచ్చని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. చోరీకి గురైన 120 సెల్‌ఫో న్లను ఎస్పీ కార్యాలయంలో బాధితులకు అప్పగించారు. సీఈఐఆర్‌లో వినియోగదారులు తమ వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్ ఫోన్‌ను యాప్ ద్వారా గుర్తించవచ్చన్నారు. ఫోన్ల రికవరీ కోసం ఎస్సై ఆధ్వర్యంలో ఒక ఆర్‌ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 786 సెల్‌ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించా మన్నారు. రికవరీలో ప్రతిభ కనబర్చిన ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ రఫీక్‌ఖాన్, సీఈఆర్‌ఐ ఆర్‌ఎస్సై కృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ మహేందర్, కానిస్టేబుళ్లు అజర్, యాకూబ్‌ను ఎస్పీ అభినందించారు.
పచ్చిమేతతో పాల దిగుబడి
సారంగాపూర్: పచ్చిమేతతో పాడిపశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మనోహర్ అన్నారు. మండలంలోని పోచంపేటలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంలో మాట్లాడారు. పశువులకు ఖనిజ లవణాలు ఉండే మిశ్రమాన్ని అందించాలని, తద్వారా పశువులు ఆరోగ్యంగా ఉంటాయని, పాల దిగుబడి కూడా పెరుగుతుందని తెలిపారు. 104 పశువులకు గర్భనిర్ధారణ పరీక్షలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించారు. అసిస్టెంట్ డైరెక్టర్ నరేశ్, సారంగాపూర్, మేడిపల్లి, ధర్మపురి మండలాల పశువైద్యాధికారులు సునీల్, రాజేందర్‌రెడ్డి, వేణుగోపాల్, సహాయక సిబ్బంది షకీల్, ఖాన్, కొండాలు, సంతోష్, నవీన్ తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు
మెట్‌పల్లిరూరల్: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు చేపడుతున్నామని మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులం పాఠశాల, కళాశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మంగళవారం ఆర్డీవోను కలిశారు. పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. డార్మిటరీ గదులు ప్రత్యేకంగా నిర్మించాలని, అటాచ్ బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. డైనింగ్ హాల్ విస్తరించాలని, ప్రహరీకి సీసీ కెమెరాలు బిగించాలని, మరో ఏఎఎన్‌ఎంను నియమించాలని, సోలర్ ఫెన్సింగ్, విద్యుత్ లైట్‌లు అమర్చాలని, 15 రోజులకోసారి పిచ్చి మొక్కలు తొలగించాలని కోరారు. విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీవో తెలిపారు. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో చంద్రశేఖర్, ఎంపీడీవో మహేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment