అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ధర్మపురి/కథలాపూర్/కరీంనగర్ కార్పొరేషన్/తిమ్మాపూర్/గంగాధర/రుద్రంగి:
రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని.. ఇందుకోసం ప్రజలంతా సంపూర్ణ మద్దతిచ్చి ఆశీర్వదించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవా రం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, కథలాపూర్ మండలం సూరమ్మ, రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట, గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలకు హాజరయ్యారు. రైతులు, రైతు కూలీలు, హరిజన, గిరిజన, బీసీ, మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేశామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.లక్ష అదనంగా ఇస్తామన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేవలం 40 వేల రేషన్‌కార్డులు ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వనుందని తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం పనులు, సూరమ్మ ప్రాజెక్టు పనుల విషయమై చర్చించేందుకు ఈనెల 25న ఇంజినీరింగ్ అధికారులు హైదరాబాద్‌కు రావాలని ఆదేశించారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి తక్కువ ఆయకట్టుకు నీరందించిందన్నారు. పంటలు ఎండిపోకుండా ఎస్సారెస్పీ నుంచి అర టీఎంసీ నీరు విడుదల చేశామని, మిగిలిన అర టీఎంసీ విడుతల వారీగా విడుదల చేస్తామన్నారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గోదావరి తీర ప్రాంతాల్లో ఎత్తిపోతలపై ఆధారపడిన రైతులకు సాగునీటి వసతి కల్పించాలని, బుగ్గారం మండలం యశ్వంతరావుపేట చెరువు, జంగల్ నాలా ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మంత్రులను కోరారు.
సూరమ్మ ప్రాజెక్టు పరిశీలన
కథలాపూర్ మండలం కలిగోట శివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనులను మంత్రులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఫొటోఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు.
అసత్య ప్రచారాలు నమ్మొద్దు
రుద్రంగి మండలకేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో మంత్రులు ఉత్తమ్, పొన్నం మాట్లాడారు. పథకాల ఎంపికపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. రేషన్ షాపుల ద్వారా త్వరలో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం
రైతులకు శాశ్వత సాగునీటి వసతి కల్పిస్తాం
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.లక్ష అదనంగా ఇస్తాం
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌గౌడ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పర్యటించిన మంత్రులు
గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌ను ఏడాదిలోపు పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఇందుకు రూ.70కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి రిజర్వాయర్‌ను పరిశీలించారు. గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మంత్రుల వెంట కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల కలెక్టర్లు పమేలా సత్పతి, సత్యప్రసాద్, సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీలు అశోక్‌కుమార్, అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయి, లక్ష్మికిరణ్, బీఎస్.లత, గౌతమ్‌రెడ్డి, ఖీమ్యానాయక్, రాష్ట్ర కో–ఆపరేటీవ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, కరీంనగర్ ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, జెడ్పీ సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపూర్
రిజర్వాయర్ పూర్తి చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment