ఇటుకబట్టీలకు ఉచితంగా బూడిద
● ఎన్టీపీసీ నుంచి 10 లక్షల టన్నుల సరఫరాకు కేంద్రం నిర్ణయం ● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ ● దాదాపు 130 మంది యజమానులకు లబ్ధి ● ఈ నెల 25 వరకు దరఖాస్తుకు అవకాశం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇటుకబట్టీలకు కేంద్రం తీపికబురు చెప్పింది. బూడిద వినియోగించి, ఇటుకలు తయారు చేసే ప్రతి బట్టీకి ఉచితంగా బూడిద సరఫరా చేసేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ చూపారు. దీంతో దాదాపు రూ.14 కోట్ల విలువ చేసే బూడిద ఇటుక ఉత్పత్తిదారులకు అందనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని ఇటుకబట్టీల యజమానులకు లబ్ధి చేకూరనుంది. కొంతకాలంగా ఇటుకబట్టీ వ్యాపారం అంతంతమాత్రంగానే నడుస్తోంది. మరోవైపు నిర్మాణ రంగం కూడా అనుకున్న మేర మార్కెట్ లేకపోవడంతో ఇటుకల ఉత్పత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రామగుండం ఎన్టీపీసీ ఫ్లైయాష్ బ్రిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత డిసెంబర్ 16న తమ పరిస్థితిని మంత్రి సంజయ్‌కి వివరించారు. రామగుండంలోని ఎన్టీపీసీ నుంచి తమకు ఉచితంగా బూడిద వచ్చేలా చూడాలని కోరారు. స్పందించిన ఆయన వారి విన్నపాన్ని సెంట్రల్ పవర్ మినిస్ట్రీకి నివేదించారు. దీంతో జనవరి ఒకటి నుంచి మే నెలాఖరు వరకు దాదాపు 120 రోజులపాటు ఉచితంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బూడిద సరఫరా చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఈ నెల 20న ఆదేశాలు జారీ చేసింది.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఉమ్మడి జిల్లాలో దాదాపు 130 మంది వరకు గుర్తింపు పొందిన ఇటుకబట్టీల యజమానులు ఉన్నారు. వీరు ఈ నెల 25వ తేదీలోపు ఈ QAWAT@ NTPC.CO.IN / L NNA NDA@ NTPC.CO.INలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ బట్టికి 25 వేల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా బూడిద ఇవ్వనుండగా రూ.6.5 లక్షల మేర లబ్ధి చేకూరనుంది. మే 31 వరకే సరఫరా చేస్తారు. తర్వాత నిలిపివేస్తారు.
ఈ పత్రాలు తప్పనిసరి..
ఎంఎస్‌ఎంఈ సర్టిఫికెట్, జీఎస్టీ రిజిస్ట్రేషన్, పాన్‌కార్డు కాపీ, పవర్ ఆఫ్ అటార్నీ ఫర్ ఆథరైజ్డ్ పర్సన్, దరఖాస్తుదారుడి వ్యాపార వివరాలు పొందుపరచాలి.
‘బండి’కి యజమానుల కృతజ్ఞతలు..
బూడిద ఉచిత సరఫరాకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని రామగుండం ఎన్టీపీసీ ఫ్లైయాష్ బ్రిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు ఉచితంగా బూడిద సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణరంగం అంతంతమాత్రంగా ఉన్న ఈ సమయంలో కేంద్ర సహాయ మంత్రి చూపిన చొరవ తాము మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఉపకరిస్తుందని యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.
బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment